
మక్తల్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీతో అందజేస్తున్న చేప పిల్లల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి కలిసి చేప పిల్లల పంపిణీని ప్రారంభించారు. ఇందులో భాగంగా మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్‌లో, మక్తల్ పెద్ద చెరువులో చేపపిల్లలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... పూర్తి రాయితీతో రాష్ట్రంలోని 26 వేల చెరువుల్లో 88 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మత్యకారులు అర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. బీసీ సమాజంలో నాయకత్వం ఎదిగినప్పుడే బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుందన్నారు. బీసీ సమాజంలో వందకు వంద శాతం కమిట్‌మెంట్ ఉన్న నాయకుడు వాకిటి శ్రీహరి అని కొనియాడారు. ప్రతీ 30 కిలోమీటర్లకు ఒక డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుందన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల వద్ద ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఇవి ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
మత్స్య శాఖను ప్రక్షాళన చేశా : వాకిటి శ్రీహరి
తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మత్స్యశాఖను ప్రక్షాళన చేశానని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న చేప పిల్లల ద్వారా ఐదు లక్షల కుటుంబాలకు ఉపాధి కలుగుతుందన్నారు. మక్తల్ నియోజకవర్గంలో 255 నీటి వనరులు ఉన్నాయని, వాటిలో 94 లక్షల చేపపిల్లలను వదలడం జరుగుతోందన్నారు. మక్తల్ పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ పనులను రూ 3.70 కోట్లతో ప్రారంభించామని, ఈ పనులు అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డాక్టర్ వినీత్, ఎమ్మెల్యేలు డాక్టర్ చిట్టెం పర్నికారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, మత్స్యశాఖ చైర్మన్ రాష్ట్ర సాయి, డైరెక్టర్ నిఖిల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, మత్స్యశాఖ జిల్లా చైర్మన్ కాంత్‌కుమార్, జిల్లా అధికారి రహమాన్ పాల్గొన్నారు.