- అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం
- హరీశ్‌రావు ఆరోపణలపై మంత్రుల ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా టెండర్లు నిర్వహించామని, హరీశ్ రావు అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సదుపాయాల కొనుగోళ్లపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు చేసిన ఆరోపణలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ తీవ్రంగా ఖండించారు.
వేర్వురుగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మొత్తం టెండర్ విలువ రూ.687.78 కోట్లు అయితే, రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని హరీశ్‌రావు చెప్పడం హాస్యాస్పదమన్నారు. హరీశ్‌రావు అవగాహన లేకుండా మాట్లాడి తన స్థాయిని తగ్గించుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా మొత్తం 27 జాతీయ బిడ్లను పరిశీలించి పూర్తి పారదర్శకంగా ఎల్-1 విధానంలో టెండర్లు ఖరారు చేశామని, ఇందులో గుజరాత్ కంపెనీ అసలే లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో ‘లిడ్‌క్యాప్’కు కేవలం రూ.40.21 లక్షల పనులిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలోనే రూ.51 కోట్ల వర్క్ ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేసిందని తెలిపారు.
