విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలంటే చదువే కీలకం: మంత్రి పొన్నం

విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలంటే చదువే కీలకం: మంత్రి పొన్నం

జగిత్యాల జిల్లా: విద్యతోనే పేద ప్రజల అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలు, విదేశాలతో పోటీ పడాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి–మోరపల్లి గ్రామ శివారులో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరువు తెచ్చిందని కొందరు విమర్శిస్తున్నారని, గతంలో టీఆర్‌ఎస్ పాలన సమయంలో కరోనా వచ్చినప్పుడు ఆ పార్టీ కరోనా తెచ్చిందని తాము అనలేదని వ్యాఖ్యానించారు. కరువు అనేది ఒక్క ప్రాంతానికే పరిమితం కాదని, పక్క రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. సమస్యలను ఎలా ఎదుర్కొని అధిగమించాలనే దానిపై దృష్టి పెట్టాలని, వాటిని రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు.

తాను విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని మంత్రి తెలిపారు. కులగణన సందర్భంగా పేద ప్రజలు అభివృద్ధి చెందడానికి విద్యే ప్రధాన మార్గమని మరింత స్పష్టమైందన్నారు. గతంలో గురుకుల విద్యాసంస్థల్లో చదువుకున్న ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తుచేశారు. అయితే, ఎంజేబీపీ గురుకులాలకు కనీసం సొంత భవనాలు కూడా లేని పరిస్థితులు ఉన్నాయన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులందరూ ఒకే చోట నాణ్యమైన విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ప్రభుత్వం నిర్మిస్తోందని మంత్రి వివరించారు. వచ్చే విద్యా సంవత్సరంలో కొన్ని ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

సామాజిక తెలంగాణ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అబద్ధాలతో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు సేవలందిస్తోందన్నారు.

విద్యారంగ అభివృద్ధికి కాంగ్రెస్ కృషి

తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాలు, విదేశాలతో పోటీ పడాలంటే విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, మోడల్ స్కూళ్ల ఏర్పాటులో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాత్రను ప్రస్తావించారు.