మేడారం పచ్చదనంతో నిండాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మేడారం పచ్చదనంతో నిండాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • రోడ్లు, పారిశుధ్యం, ల్యాండ్​ స్కేపింగ్​పై దృష్టి పెట్టాలి 
  • సీఎం టూర్​కు ఏర్పాట్లు పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి 

ములుగు/ తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క-–సారక్క ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపాలని, ఈ నెల 18న సీఎం పర్యటనకు ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మేడారం జాతర పనులను మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్​కుమార్​తో కలిసి ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గద్దెల పునరుద్ధరణ పనులను పరిశీలించిన తర్వాత వన దేవతలను దర్శించుకున్నారు. 

ఆలయ ప్రాంగణంలో ల్యాండ్ స్కేపింగ్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పీటీ బీమ్స్ పై అమర్చుతున్న బ్రాకెట్లు, మీడియా టవర్స్, క్యూ లైన్స్ షెడ్స్, కల్చరల్ ప్రాంగణాల పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. హరిత హోటల్ లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడారం జాతర ప్రాంతంలో రాష్ట్ర కేబినెట్​మీటింగ్​ నిర్వహణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి సీతక్క అన్నారు.

ఇంటి వద్దకే సమ్మక్క సారలమ్మ ప్రసాదం

హైదరాబాద్​సిటీ, వెలుగు: మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు నేరుగా ఇంటివద్దకే అమ్మవారి ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.    భక్తులు రూ. 299 చెల్లిస్తే ప్రసాదం నేరుగా భక్తుల ఇంటికే చేరవేస్తామని అధికారులు చెప్పారు. భక్తులు ఆర్టీసీ వెబ్​సైట్​లోకి లాగిన్​ అయికానీ, సమీపంలోని టీజీఎస్​ ఆర్టీసీ లాజిస్టిక్​ కౌంటర్లలో అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని బుక్​ చేసుకోవచ్చన్నారు.