పూల జాతర… తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక మన బతుకమ్మ పండుగ వచ్చేసింది. రాష్ట్రంలో పూల జాతర షురూవైంది. ఉరూ...వాడవాడలా సంబురంగా మొదలైంది. పెత్రామాస నుంచి మొదలు దసరాకు ముందు వరకు పల్లె, పట్నం ఉయ్యాల పాటలతో మారుమోగనున్నాయి. ఆడబిడ్డల ఆటలకు యావత్ తెలంగాణ ఊగిపోనుంది. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పూల సంబురం కలర్ ఫుల్ గా జరగనుంది. స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడంతో అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన జాతర సద్దుల బతుకమ్మతో ముగియనుంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రమంతటా బతుకమ్మసంబురాలు వైభవంగా మొదలయ్యాయి. గల్లీలన్ని ఆడబిడ్డల ఆట పాటలతో నేలంతా మురిసిపోతుంది.
ALSO READ | రాజ్‌భవన్ గవర్నమెంట్ స్కూలులో సందడిగా బతుకమ్మ సంబురాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్ లో బతుకమ్మ సంబురాలు నిర్వహించింది. ఈ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు సీతక్క. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు బతుకమ్మ ఆడుతూ కనువిందు చేశారు. మహిళలతో కలిసి మంత్రి సీతక్క పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వరంగల్ లోని తోట మైదానంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద దేవి. తొమ్మిది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది రాష్ట్ర సర్కార్.