మాజీ మంత్రి జీవన్‌‌‌‌ రెడ్డి ఇంటికి మంత్రులు

మాజీ మంత్రి జీవన్‌‌‌‌ రెడ్డి ఇంటికి మంత్రులు
  • దేవుడు ఆదేశించాడు.. మానవుడు అనుసరిస్తాడన్న జీవన్‌‌‌‌రెడ్డి

జగిత్యాల, వెలుగు: మాజీ మంత్రి జీవన్‌‌‌‌రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయన నివాసానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం చేరుకుని కీలక భేటీ నిర్వహించారు. పార్టీ పరిస్థితులు, స్థానిక సమస్యలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని జీవన్‌‌‌‌రెడ్డిని కోరినట్లు తెలిపారు. 

ఆయనకు పార్టీ పూర్తి అండగా నిలబడే ఆలోచనలో ఉందని స్పష్టం చేశారు. భేటీలో చర్చించిన అంశాలను పార్టీ హైకమాండ్‌‌‌‌, సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ ప్రాంతానికి జీవన్‌‌‌‌రెడ్డి పెద్ద దిక్కు అని, ఆయన గురించి తెలంగాణలో తెలియని వారు ఎవరూ ఉండరని పేర్కొన్నారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గొంతుకగా పనిచేసిన నాయకుడని కొనియాడారు. జీవన్‌‌‌‌రెడ్డి బాధపడితే తామూ బాధపడినట్టే అన్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ నాయకులు మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌, మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి ఇప్పటికే జీవన్‌‌‌‌రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను జీవన్‌‌‌‌రెడ్డి తమ దృష్టికి తీసుకువచ్చినట్లు శ్రీధర్​బాబు వెల్లడించారు. మంత్రులతో చర్చపై జీవన్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. దేవుడు  ఆదేశించాడు మానవుడు అనుసరిస్తాడు అని సమాధానమిచ్చారు.