
సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. నంగునూరులో ఎంపీడీవో ఆఫీసు,నూతన తహసీల్దార్ భవనాలతో పాటు బట్టర్ ఫ్లై వెలుగులో నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు, ఇరిగేషన్ గెస్ట్ హౌస్ భవనాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 307 కోట్ల రూపాయిలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
ఎకరాకు రూ. 10 వేలు
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10వేల రూపాయిలు అంజేస్తామన్నారు. వడగండ్ల వానకు సిద్దిపేట జిల్లాలో 80 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనాలున్నాయన్నారు. 200 కోట్ల రూపాయిలతో ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకోసం బడ్జెట్లో వెయ్యికోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో నంగునూర్ మండలంలో మెరుగ్గా ఉందన్నారు. ఈ పంట సాగుకు అన్నీ రకాల సబ్సిడీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు.
నంగునూరు దశ దిశ మారుతుంది
సిద్దిపేట తరహాలో నంగునూరులో నాలుగు లైన్ల రహదారి బట్టర్ ఫ్లై లైట్లతో జిగేల్ జిగేల్ మనేలా లైటింగ్ ఏర్పాట్లు చేయబోతున్నామన్నారు. మండ్రాయి, ఆంక్షాపూర్, నాగరాజుపల్లి రోడ్డు మార్గం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ, నంగునూరు మీదుగా వెళ్తున్న ఔటర్ రింగురోడ్డుతో...నంగునూరు దశ–దిశ మారుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో గతుకుల మయంగా ఉన్నరోడ్లు.. బతుకుదెరువు కోసం పక్కరాష్ట్రాలకు వెళ్లే వాళ్ళంటై.. కానీ కేసీఆర్ సీఎం అయిన తరువాత పక్కరాష్ట్రాల వారు తెలంగాణలో బతుకుతున్నారని మంత్రి హరీశ్ వెల్లడించారు.
కేసీఆర్ దేశంలోనే నిజమైన నాయకుడు
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలోనే నిజమైన నాయకుడని మంత్రి హరీశ్ రావు అన్నారు. సకాలంలో ఎరువులు, కరెంట్, సాగునీరు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. రానున్న రోజుల్లో అధికారులు, ప్రజాప్రతినిథులు చొరవ తీసుకొని రైతుల్లో చైతన్యం వచ్చేలా అవగాహన కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. నెల రోజులు ముందుగానే వరి కోతలు ముగిసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు, రైతులకు అవగాహన కల్పించాలని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీటీసీ తడిసిన ఉమావెంకట్ రెడ్డి, ఎంపీపీ అరుణ దేవి, ఆర్డీఓ అనంతరెడ్డి, స్థానిక మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.