39 వేల కోట్ల డీల్.. కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న డిఫెన్స్ మినిస్ట్రీ

39 వేల కోట్ల డీల్.. కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న డిఫెన్స్ మినిస్ట్రీ
  • బ్రహ్మోస్ మిసైళ్లు, రాడార్లు, వెపన్ సిస్టమ్​ల కొనుగోళ్లకు అగ్రిమెంట్స్

న్యూఢిల్లీ: సాయుధ బలగాల పోరాట సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ మంత్రిత్వ శాఖ 39,125 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. బ్రహ్మోస్ మిసైళ్లు, రాడార్లు, వెపన్ సిస్టమ్, ఏరో ఇంజిన్​ల కొనుగోలు​వంటి ఐదు కీలక ఒప్పందాలపై రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, రక్షణ కార్యదర్శి గిరిధర్ అరమనే సమక్షంలో శుక్రవారం సంతకాలు జరిగాయి. 

ఈ ఒప్పందాలు మన దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయని, ఫారిన్ కరెన్సీ.. ఫారిన్ వెపన్స్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తాయని డిఫెన్స్ మినిస్ట్రీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. బ్రహ్నోస్ మిసైళ్ల కొనుగోలుకు సంబంధించి రెండు వేర్వేరు ఒప్పందాలు కుదిరాయి. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్(బీఏపీఎల్) నుంచి రూ.19 వేల కోట్లతో బ్రహ్మోస్ మిసైళ్లను కొనుగోలు, రూ.988 కోట్లతో యుద్ధ నౌకల ద్వారా ప్రయోగించగలిగే బ్రహ్మోస్ మిసైళ్లను అదే సంస్థ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 

ఈ మిసైళ్లు సూపర్ సోనిక్ వేగంతో టార్గెట్​ను ఖచ్చితంగా రీచ్ అవుతాయని మినిస్ట్రీ వెల్లడించింది. రూ.5,249 కోట్లతో మిగ్ విమానాలకు అమర్చే ఆర్డీ33 ఏరో ఇంజిన్​ల కొనుగోలుకు ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్​ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో రక్షణ శాఖ ఎంవోయూ చేసుకుంది. రూ.7,668 కోట్ల వ్యయంతో క్లోజ్-ఇన్ వెపన్ సిస్టమ్ కొనుగోలు కోసం లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్‌తో మంత్రిత్వ శాఖ డీల్ కుదుర్చుకుంది. ఇదే కంపెనీతో రూ.5700 కోట్ల వ్యయంతో హై పవర్​ రాడార్ సిస్టమ్​ను సేకరించాలని మినిస్ట్రీ అగ్రిమెంట్ చేసుకుంది.