అమానుషం.. వేడినీళ్లు పోసి పైపుతో కొట్టి చిత్రహింసలు

అమానుషం..  వేడినీళ్లు పోసి పైపుతో కొట్టి చిత్రహింసలు

 

  •     బైక్​ తగలబెట్టారంటూ..మైనర్, యువకుడిపై అమానుషం
  •     నిర్బంధించి వేడినీళ్లు పోసి పైపుతో కొట్టి చిత్రహింసలు  
  •     అరుపులు విని కాపాడిన స్థానికులు
  •     ఇదే ఊరిలో బైక్​చోరీ చేశారంటూ మరొకరిని  స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్తులు  
  •     మెదక్ ​జిల్లా వెంకట్రావుపేటలో  అమానవీయ ఘటనలు 

కౌడిపల్లి, వెలుగు : మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట లో అమానవీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. బైక్ ​కాలబెట్టావంటూ మైనర్​ బాలుడితో పాటు ఓ యువకుడిని ఓ చికెన్​షాపు యజమాని రూములో నిర్బంధించి ఐదు గంటల పాటు చిత్రహింసలు పెట్టగా, ఇదే ఊరిలో టూ వీలర్లు దొంగతనం చేస్తున్నారంటూ మరో యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. మొదటి ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధి తుల కథనం ప్రకారం..వెంకట్రావుపేట్ గేటు వద్ద కొన్నేండ్లుగా వడ్డెర కులస్తులు నివాసముంటున్నారు. కొందరు అక్కడే హోటళ్లు, చికెన్ సెంటర్లతో పాటు కూలీ పనులు చేసుకుంటూ బతు కుతున్నారు. గ్రామానికి చెందిన ఖాజా పాషా చికెన్ సెంటర్​లో కొద్ది రోజులుగా 14 ఏండ్ల  బాలుడు పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి తన ఇంటి ముందున్న బైకును తగలబెట్టాడని అనుమానించిన ఖాజా పాషా తెల్లవారుజామున నాలుగు గంటలకు సదరు బాలుడిని ఓ రూమ్​లో బంధించాడు. బకెట్​లో నీళ్లు పోసి వాటర్​ హీటర్​పెట్టి వేడి చేశాడు. సలసల కాగే నీళ్లను ముందు కాళ్లపై పోసి టెస్ట్​ చేశాడు. చర్మం ఊడిరావడంతో తల, వీపు, కాళ్లపై కూడా పోశాడు. వేడి నీళ్లతో చర్మం ఊడుతున్నా పట్టించుకోకుండా పైపుతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. బాధతో అరుస్తున్నా వదిలిపెట్టలేదు. బాలుడి స్నేహితుడు పోచయ్యకు  కూడా బైక్​ కాలబెట్టిన ఘటనతో సంబంధం ఉందంటూ సాబేర్ అనే వ్యక్తితో కలిసి వెళ్లి తీసుకువచ్చాడు. అక్కడ ఇద్దరినీ మళ్లీ వేడి నీళ్లు పోసి పైపుతో కొట్టాడు. ఇలా ఐదు గంటలు హింసించిన తర్వాత వదిలేసి పరారయ్యారు. బాధితులు ఒళ్లంతా కాలిపోయి విలవిల్లాడారు. బాధ భరించలేక గట్టిగా అరవగా అటుగా వెళ్తున్న కొంతమంది పరిగెత్తుకు వచ్చి చూశారు. అప్పటికే తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న ఇద్దరిని లేవదీసి ఇరుగుపొరుగు వారికి చెప్పారు. అందరూ కలిసి విడిపించడంతో బాధితులు కౌడిపల్లి పీఎస్​లో ఫిర్యాదు చేశారు. ఇద్దరిని స్థానిక గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించగా ఫస్ట్​ ఎయిడ్​ చేసిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం నర్సాపూర్ ఏరియా దవాఖానకు రెఫర్ ​చేశారు. నిందితుడు ఖాజాపాషాపై  జువైనల్ ​జస్టిస్ ​యాక్ట్ కింద కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు. 

ఎండలో బట్టలూడదీసి...స్తంభానికి కట్టేసి..

వెంకట్రావుపేటలోనే మరో దారుణం జరిగింది. గ్రామంలోని గేటు వద్ద బైక్​లు దొంగతనం చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరిని బట్టలూడదీసి  స్తంభానికి కట్టేసి కొట్టారు. సోమవారం రాత్రి కౌడిపల్లి మండలం తిమ్మాపూర్​కు చెందిన వడ్ల సాయిలు, చాకలి శంకర్​ కటింగ్ ప్లేయర్, పానాలు పట్టుకొని తిరుగుతుండగా గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో వారు దురుసుగా సమాధానమిచ్చి వెళ్లిపోయారు. అదే రాత్రి గ్రామంలో ఒకరి ఇంటి వద్ద బైక్ టైర్లు చోరీ చేస్తుండగా పట్టుకున్నారు. మంగళవారం ఉదయం ఇద్దరిని వెంకట్రావుపేట గేట్ వద్ద నేషనల్​హైవే పక్కన ఉన్న స్తంభానికి కట్టేసి కొట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పీఎస్​కు తరలించారు.