
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ మేరకు పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం మధ్యాహ్నం 1.25గంటలకు శంషాబాద్ కు బీజేపీ అగ్రనేత అమిత్ షా చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా నోవాటెల్ కు వెళతారు. అక్కడ మధ్యాహ్నం 1.40 నుంచి గంట పాటు బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమై.. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితిలపై రాష్ట్రనేతలతో చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.05గంలకు చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయానికి అమిత్ షా వెళతారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని షా పూరించనున్నారు.
ఆపై 3.50గంలకు కొంగరకలాన్ లోని శ్లోక కన్వెన్షన్ కు అమిత్ షా చేరుకుంటారు. అక్కడ గంటన్నర పాటు పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ మండల అధ్యక్షుడు నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు హాజరుకానున్న సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్రనేతలకు అమిత్ దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5.40గంటలకు కొంగరకాలన్ నుంచి శంషాబాద్ నోవాటెల్ హోటల్ కు కేంద్రమంత్రి చేరుకుంటారు. అనంతరం రెండు ముఖ్య సమావేశాల్లో అమిత్ షా పాల్గొంటారు. సాయంత్రం 6.50గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీకి తిరిగి వెళతారని ఆ వర్గాలు తెలిపాయి.