న్యూఢిల్లీ: ఐపీఎల్–2026 షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. ముందుగా ఖరారు చేసిన మార్చి 26 నుంచి కాకుండా 28 నుంచి 19వ సీజన్ పోటీలు మొదలుకానున్నాయి. మే 31న మెగా ఫైనల్ జరగనుంది. అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడులోని అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయి షెడ్యూల్‌ను రిలీజ్ చేసేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చే వారం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
కోల్‌కతా, చెన్నై.. కేకేఆర్, సీఎస్కేకు హోమ్ బేస్‌లుగా ఉండగా, అస్సాం రాజధాని గువాహటి రాజస్తాన్‌కు రెండో వేదికగా ఉంది. 2008లో మెగా లీగ్ ప్రారంభమైనప్పట్నించి దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను రెండు భాగాలుగా ప్రకటించారు. ఈసారి కూడా అదే తరహాలో వెళ్లాలా..? వద్దా..? అన్నది జీసీ మీటింగ్‌లో నిర్ణయించనున్నారు. డిఫెండింగ్ చాంప్ ఆర్సీబీ ఆడే తొలి మ్యాచ్ ఎక్కడ నిర్వహించాలనే దానిపై కూడా ఓ నిర్ణయానికి రానున్నారు.
