మైనర్ ని పెళ్లి చేసుకుని..ఇంటి దగ్గర వదిలి వెళ్లాడు

మైనర్ ని పెళ్లి చేసుకుని..ఇంటి దగ్గర వదిలి వెళ్లాడు

పరారీలో నిందితుడు..మల్కాజిగిరి పీఎస్ పరిధిలో ఘటన

మల్కాజిగిరి, వెలుగు: మైనర్ ని పెళ్లి చేసుకున్న ఓ  యువకుడు ఆమెను ఇంటి దగ్గర వదిలిపెట్టి పారిపోయాడు. ఈ ఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో జరిగింది. బాధితురాలు, ఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం..గద్వాలకి చెందిన ఆకుల సత్తమ్మ కుటుంబంతో కలిసి కొన్నేళ్ల క్రితం వలస వచ్చి సిటీలోని ఓల్డ్ మల్కాజిగిరిలో ఉంటోంది. ఆమె రెండో కూతురు(17) కూలీ పనికి వెళ్లేది.  ఫిబ్రవరి 27న పనికి వెళ్లిన తన కూతురు కనిపించడం లేదంటూ మార్చి 4న సత్తెమ్మ మల్కాజిగిరి పోలీసులకు కంప్లయింట్ చేసింది.

కంప్లయింట్ లో తన కూతరు వయసు 19 ఏళ్లుగా సత్తెమ్మ పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉండగానే..తన కూతురు క్షేమంగా ఇంటికి వచ్చిందని సత్తెమ్మ ఈ నెల 16న పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ఆ అమ్మాయిని వైద్యపరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కి పంపారు.

ఈ నెల 26న గాంధీ లోని మెడికల్ ఆఫీసర్ సత్తెమ్మ కూతురికి 17 ఏళ్లుంటాయని తేల్చారు.  సత్తెమ్మ కూతురు మైనర్ గా గుర్తించిన పోలీసులు ఆ బాలికను విచారించారు. తాను పనికి వెళ్తున్న సమయంలో మహ్మద్ రసూల్ అలియాస్ జానీ(23)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని ఆ బాలిక వివరించింది. జానీతో తన పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఫిబ్రవరి 27న పనికి వెళ్తున్నట్టు చెప్పి మల్కాజిగిరికి వెళ్లి జానీతో కలిసి వరంగల్ బస్సు ఎక్కానంది.

హన్మకొండలో దిగి దుర్గాదేవి ఆలయంలో తాను, జానీ పెళ్లి చేసుకుని..రాయపురలో ఓ రూమ్ రెంట్ కి తీసుకుని ఈ నెల 15వరకు ఉన్నామంది. 5 నెలల పాటు సంసారం చేసిన జానీ.. ఈ నెల 16న అతడి తల్లిదండ్రులకు పెళ్లి విషయం చెప్పి నన్ను తీసుకెళ్తానని నమ్మించి..మల్కాజిగిరిలోని ఇంటి దగ్గర వదిలేశాడంది. జానీ తిరిగిరాలేదని..మోసం చేశాడని ఆ బాలిక మల్కాజిగిరి పోలీసులకు కంప్లయింట్ చేసింది. జానీపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.  జానీని అదుపులోకి తీసుకుంటామన్నారు.