మజ్లిస్ కంచుకోటపై..కాంగ్రెస్ ఫోకస్!

మజ్లిస్ కంచుకోటపై..కాంగ్రెస్ ఫోకస్!
  •     ఎంఐఎం ​ఇంటిపోరును అనుకూలంగా మార్చుకునే వ్యూహం
  •     పతంగి గుర్తుకు ఓటేస్తే  గులాబీ పార్టీకి లాభమైతదనే వాదన
  •     ఎంఐఎం, బీఆర్ఎస్ బంధంపై మైనార్టీల్లో వ్యతిరేకత
  •     అసమ్మతులను తమ వైపు లాగేందుకు కాంగ్రెస్​ ప్లాన్ 

హైదరాబాద్, వెలుగు : మజ్లిస్​కు కంచుకోట పాతబస్తీ . ముస్లింలే ఆ పార్టీ ఓటు బ్యాంకు. అక్కడ ఏ పార్టీ పోటీచేసినా మజ్లిస్ చేతిలో ఓటమి ఖాయం. అలాంటి చోట పాగా వేసేందుకు కాంగ్రెస్​ కసరత్తు చేస్తున్నది. మజ్లిస్, బీఆర్ఎస్ ​బంధాన్ని వ్యతిరేకిస్తున్న ముస్లింలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్​ వైపు ఆసక్తి చూపుతున్నట్టు అక్కడి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

మరోవైపు మజ్లిస్​లో ఇంటిపోరును.. ప్రభుత్వంపై ప్రజల్లో  పెరిగిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు హస్తం నేతలు ఫోకస్ చేశారు.  దీంతో ఈసారి తమదే విజయం అనే ధీమాతో ఉన్న కాంగ్రెస్​.. పాతబస్తీలో మజ్లిస్​కు చెక్ పెట్టాలని నిర్ణయించింది. అక్కడ ప్రస్తుత పరిస్థితులు కలిసి వచ్చే అవకాశంగా ఉన్నాయని భావిస్తూ అందుకనుగుణంగా అడుగులు వేస్తుంది. 

నాలుగు సెగ్మెంట్లపై టార్గెట్​

మజ్లిస్ ​ప్రాతినిథ్యం వహించే 7 సీట్లలో కనీసం నాలుగు దక్కించుకోవాలని వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటుంది. అందుకనుగుణంగా కాంగ్రెస్ నేతలు ప్లాన్ రెడీలో నిమగ్నమయ్యారు. యాకుత్​పురా, చార్మినార్, బహదూర్​పురా, నాంపల్లి సెగ్మెంట్లలో కాంగ్రెస్ ​జెండా ఎగరవేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయా స్థానాలపైనే ​ఫోకస్ చేసింది. మరోవైపు మజ్లిస్​లోని అసమ్మతి నేతలను తమవైపు తిప్పుకునేందుకు, ఇందుకు స్థానికంగా చురుగ్గా ఉండే మజ్లిస్ నేతలను, కీలకమైన వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

మజ్లిస్​లోని ముఖ్య నేతలు కాంగ్రెస్​లోకి వస్తే వారికే టికెట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ ​సానుభూతి పరులు ఉన్నా కానీ.. వారిని సరిగా వాడుకోలేకపోవడంతోనే  పార్టీ గెలవడం లేదని వెల్లడైంది. ప్రస్తుత పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని, అవసరమైతే అక్కడ ప్రచారానికి రాహుల్​గాంధీని రప్పించేందుకు అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. 

పెరుగుతున్న వ్యతిరేకత

ఓల్డ్ సిటీలో ఇప్పటివరకూ ముస్లింలు మజ్లిస్​కు సపోర్ట్​గా నిలవడగా.. ఆ పార్టీ బీఆర్ఎస్​తో దోస్తీ చేయడం కొందరు మైనార్టీలకు మింగుడు పడడం లేదు. పైగా విద్యావంతులు, వ్యాపారులు, యువకులు మజ్లిస్​పై కొంత అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ​ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నవారంతా మజ్లిస్​కు ఓటు వేస్తే అది మళ్లీ గులాబీ పార్టీకే లాభం చేకూర్చుతుందన్న భావనలో ఉన్నారు. అందుకు ముస్లిం ఓట్లు చీలకూడదని భావిస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్​, మజ్లిస్, కొన్ని సందర్భాల్లో బీజేపీ, మజ్లిస్​ల మధ్య అవగాహనపైనా  చైతన్యం కలిగిన మైనార్టీలు గమనిస్తున్నారు.

దీంతో మైనారిటీల ప్రయోజనాలను కాపాడే బలమైన పార్టీ కాంగ్రెస్​అనే వాదన కూడా పాతబస్తీ వర్గాల్లో వినిపిస్తుంది. ఏళ్ల తరబడిగా మజ్లిస్​కు ఓటు వేస్తున్నా తమ ప్రాంత అభివృద్ధికి నోచుకోక పోవడాన్ని మరికొందరు మైనారిటీలు గమనిస్తున్నట్టు తెలిపారు. ఈసారి రాజకీయంగా పాతబస్తీలోని మైనారిటీలు మంచి అవగాహన కలిగి ఉన్నట్టు కూడా చెబుతున్నారు. కాబట్టి ముస్లింల సంక్షేమానికి పాటుపడే వారికి తాము ఓటు వేస్తామని అనుకుంటున్నారు. దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం.

అసమ్మతి పోరు

మజ్లిస్​లో కొంతకాలంగా అసమ్మతి పోరు నడుస్తున్నది. ఇది కాస్త ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ​ఓవైసీకి తలనొప్పిగా తయారైంది. దీంతోనే ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేకపోతున్నట్టు సమాచారం. వృద్ధ నేతలను కాదని ఈసారి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న నిర్ణయాన్ని చాలామంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. మరోపైపు వారసులను పోటీలోకి దించడాన్ని విబేధిస్తున్నట్టు సమాచారం. యాకుత్​పురా, చార్మినార్​, బహదూర్​ పురాలో సిట్టింగ్​లకు ఈసారి టికెట్​ కష్టమేనని అంటున్నారు. దీంతో వారు పార్టీ నేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.

ALSO READ : వలస కూలీల ఓట్ల కోసం.. ముంబై, పుణె, భీవండి, షోలాపూర్ బాటపట్టిన పాలమూరు ఎమ్మెల్యేలు

యాకుత్​పురా ఎమ్మెల్యే ముంతాజ్​ ఖాన్​ తనకు టికెట్ ఇవ్వక పోతే పార్టీ మారతానని బాహాటంగానే చెబుతున్నారు. ఇలాంటి పరిణామాలతో మజ్లిస్​పరిస్థితులను తనకు అనుకూలంగా చేసుకునేందుకు కాంగ్రెస్ ​సిద్ధమైంది. దీంతో అసంతృప్తులతో రాయబారాలు కొనసాగిస్తున్నట్టు.. ఇదే జరిగితే నాలుగు నియోజకవర్గాలను వారికే కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నాంపల్లి నుంచి ఫిరోజ్​ఖాన్​వంటి బలమైన నేతను కాంగ్రెస్ ​అభ్యర్థిగా రంగంలోకి దింపింది. దీంతో ప్రస్తుతం ఇక్కడి నుంచి మజ్లిస్ సిట్టింగ్​ ఎమ్మెల్యే మెరాజ్​ హుస్సేన్​ను మార్చాలని కూడా ఆ పార్టీ భావిస్తున్నది.