మైనార్టీల మనసు గెలుస్తున్నబీజేపీ

మైనార్టీల మనసు గెలుస్తున్నబీజేపీ

న్యూఢిల్లీ‘మైనార్టీల వ్యతిరేక పార్టీ’.. బీజేపీ గురించి ప్రతిపక్షాలు చేసే ప్రధాన విమర్శ ఇది. ఈ ముద్రను నెమ్మదిగా చెరిపేసుకుంటోంది కమలం పార్టీ. ప్రతి ఎన్నికలకూ తన బలాన్ని పెంచుకుంటున్న ఆ పార్టీ మైనార్టీల మనసులు కూడా గెలుచుకుంటోంది. తాజా లోక్​సభ ఎన్నికల్లో మైనార్టీల డామినేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ కాషాయ జెండా ఎగరేసింది. ఇలాంటివి దేశవ్యాప్తంగా 79 సెగ్మెంట్లు ఉంటే బీజేపీ 41 సీట్లు(50 శాతానికిపైగా) గెలుచుకుంది. 2014తో పోలిస్తే ఇక్కడ బీజేపీ సీట్ల సంఖ్య ఏడు పెరిగింది. ఇదే సమయంలో కాంగ్రెస్​ పార్టీ సీట్లు భారీగా తగ్గాయి. ఇలాంటి ప్రాంతాల్లో 2014లో కాంగ్రెస్​ 12 చోట్ల గెలిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది.

90 జిల్లాల్లో ముస్లింల ప్రభావం

130 కోట్ల మంది దేశ జనాభాలో దాదాపు 20 శాతం మంది ముస్లింలు ఉన్నారు. దేశవ్యాప్తంగా మైనార్టీల డామినేషన్​ ఎక్కువ ఉన్న జిల్లాలు 90 వరకూ ఉన్నాయి. 2008లో యూపీఏ ప్రభుత్వం ఓ పథకం అమలు సందర్భంగా ఈ విషయాన్ని గుర్తించింది. మైనార్టీల అంశాన్ని పక్కన పెడితే సామాజికంగా.. ఆర్థికంగా.. మౌలిక వసతుల పరంగా నేషనల్​ యావరేజ్​తో పోలిస్తే ఈ జిల్లాలు చాలా దిగువన ఉన్నాయి. మైనార్టీలకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, పైగా వారిపై వివక్ష చూపుతోందని, దాడులను ప్రోత్సహిస్తోందని ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. అయితే తాజా ఎన్నికల్లో అవేవీ బీజేపీని అడ్డుకోలేకపోయాయని తేలింది.

ముస్లిం ఎంపీలు 27 మంది

తాజా లోక్​సభ ఎన్నికల్లో 27 మంది ముస్లింలు ఎంపీలుగా గెలుపొందారు. 2014లో లోక్​సభకు ఎంపికైన ముస్లిం అభ్యర్థులు 23 మందే. ఈసారి ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్​ నుంచి ఎన్నికైన వారే డజను మంది. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆరుగురు అభ్యర్థుల్లో ఒక్కరు కూడా గెలవలేదు. యూపీ నుంచి ఆరుగురు, బెంగాల్​ నుంచి ఆరుగురు, కేరళ, జమ్మూకాశ్మీర్ నుంచి ముగ్గురు చొప్పున, అస్సాం, బీహార్​ నుంచి ఇద్దరు చొప్పున ముస్లింలు ఎంపీలుగా గెలిచారు. తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, లక్షద్వీప్ నుంచి ఒక్కొక్కరు విజయం సాధించారు. పార్టీల పరంగా టీఎంసీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీ, ముస్లింలీగ్​ నుంచి ముగ్గురు చొప్పున గెలిచారు. ఎంఐఎం నుంచి ఇద్దరు, ఎల్జేపీ, ఎన్సీపీ, సీపీఎం, ఏఐయూడీఎఫ్ నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు.

యూపీలోనూ కమలం హవానే..

దేశంలోనే అతి ఎక్కువ లోక్​సభ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్​లో ముస్లింల జనాభా 20 శాతానికిపైగానే. రాంపూర్, నగీనా, మోరాదాబాద్, సంభాల్, ఆమ్రోహల్లోని 20 లోక్​సభ సెగ్మెంట్లలో ముస్లింలు సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ 15 సీట్లలో బీజేపీ విజయభేరి మోగించింది. ఎస్పీ‌‌-బీఎస్పీ కూటమి ఐదు చోట్ల మాత్రమే గెలిచింది. ఉత్తరప్రదేశ్​లో కాంగ్రెస్​ పార్టీ ఆరుగురు ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించితే ఒక్కరు కూడా గెలవలేదు. ఇక బీహార్​లో ముస్లిం పాపులేషన్​ ఎక్కువ ఉన్న సీట్లు ఏడు ఉంటే.. బీజేపీ, జేడీయూ, లోక్​జనశక్తి కూటమి ఆరు చోట్ల, కాంగ్రెస్​ ఒక చోట గెలిచాయి.