
ఫోర్డే (నార్వే): ఇండియా స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మరోసారి మెరిసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మీరా 48 కేజీ కేటగిరీలో తన మార్కు చూపెడుతూ సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. ఫలితంగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మూడో పతకం అందుకుంది.
2017లో వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన ఆమె 2022లో రజతం గెలుచుకుంది. శుక్రవారం జరిగిన పోటీలో మీరా మొత్తం 199 కేజీల బరువు ఎత్తి రెండో స్థానం సాధించింది. స్నాచ్‌లో 84 కేజీల బరువు మోసిన ఆమె , క్లీన్ అండ్ జర్క్‌లో115 కేజీలు ఎత్తింది. స్నాచ్‌లో 87 కేజీల బరువు ఎత్తడంలో రెండుసార్లు విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో మాత్రం ఆమె అద్భుతంగా రాణించింది.
109, 112, ఆఖరికి 115 కేజీల బరువును కూడా అలవోకగా ఎత్తింది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచినప్పుడు కూడా చాను 115 కేజీలనే లిఫ్ట్ చేయడం గమనార్హం. నార్త్ కొరియాకు చెందిన రి సాంగ్ గమ్ మొత్తం 213 కేజీల (91+ 122) బరువు ఎత్తి స్వర్ణ పతకంతో పాటు క్లీన్ అండ్ జర్క్, టోటల్ లిఫ్ట్‌తో కొత్త వరల్డ్ రికార్డులను నెలకొల్పింది. థాయ్లాండ్ లిఫ్టర్ థాన్యాథాన్ సుక్చారోన్ మొత్తం 198 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకాన్ని సాధించింది.