
హైదరాబాద్, వెలుగు: తెగుళ్ల కారణంగా రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరానికి రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని అగ్రికల్చర్ కమిషనరేట్‌ను ముట్టడించారు. పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి కేంద్రానికి పంపాలని, ప్రకృతి విపత్తుగా పరిగణించి రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్, రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు కమిషనరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. తర్వాత అడిషనల్ కమిషనర్ విజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు.