దేశంలోని టాప్ టెక్ కంపెనీ TCSలో ఐదున్నరేళ్లు పనిచేసిన ఒక ఉద్యోగి జీతం పెరగాల్సింది పోగా.. తగ్గడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రెడ్డిట్ వేదికగా 'r/developersIndia' అనే ఒక జావా డెవలపర్ పంచుకున్న తన స్టోరీ ఐటీ రంగంలోని చీకటి కోణాలను, కెరీర్ పట్ల అశ్రద్ధ వహిస్తే జరిగే పరిణామాలను కళ్లకు కడుతోంది.
సదరు ఉద్యోగి 2020లో ఒక టైర్-3 కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. రూ. 25వేల శాలరీతో టీసీఎస్‌లో చేరారు. అయితే ఐటీ రంగంలో రాణించాలనే పట్టుదల కంటే.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో అతడు తన సమయాన్ని దానికోసం ఎక్కువగా కేటాయించారు. ఫలితంగా ఆఫీసు పనిలో వెనుకబడటం, పనితీరు సమీక్షల్లో వరుసగా లో-బ్యాండ్స్ రావడం మొదలైంది. దీని ప్రభావం ఎంతలా ఉందంటే2020లో రూ.25వేలుగా ఉన్న ఆయన నెలవారీ వేతనం.. 2026 నాటికి రూ.22వేల 800కి పడిపోయింది.
తక్కువ పనితీరు కారణంగా 2025 జూలైలో టీసీఎస్ అతన్ని 'పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్' (PIP)లో ఉంచింది. ఆ తర్వాత మేల్కొన్న యువ టెక్కీ.. కష్టపడి అప్ స్కిల్లింగ్ చేసుకుని కొత్త ప్రాజెక్ట్ సంపాదించినా.. కంపెనీ అతడి అప్రైజల్‌ను నిలిపివేసింది. ప్రస్తుతం జావా బ్యాకెండ్ డెవలపర్‌గా నైపుణ్యాలను పెంచుకున్నప్పటికీ.. బయట ఉద్యోగం రావడం గగనంగా మారింది. ఇంటర్వ్యూలు క్లియర్ చేసినా 5.5 ఏళ్ల అనుభవం ఉండి కూడా రూ.22 వేల జీతం ఉండటం చూసి హెచ్‌ఆర్స్ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ జాబ్ ఆఫర్లను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పాడు టెక్కీ.
ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావటంతో నెట్టింట చాలా మంది అతడికి సలహాలు ఇస్తున్నారు. కొందరు చిన్న స్టార్టప్‌లలో చేరి తక్కువ జీతానికి పనిచేస్తూ.. రెండేళ్లలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుని కెరీర్‌ను ట్రాక్‌లోకి తీసుకొచ్చుకోమని సూచిస్తున్నారు. మరొకరు టెక్నికల్‌గా వెనుకబడినప్పుడు ఎంబీఏ చేసి మేనేజ్‌మెంట్ వైపు వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని అంటున్నారు. మరొకరు కంపెనీల దగ్గర నిజం చెప్పి తాను గతంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించటం వల్ల ఇలా జరిగిందని ఓపెన్ అయితే అంగీకరించే కంపెనీలు ఉంటాయని సూచించారు.
ప్రస్తుతం ఉన్న ఏఐ యుగంలో స్కిల్స్ చాలా ముఖ్యమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తప్పులు అస్సలు చేయెుద్దని.. తమకు ఇతర ఇంట్రెస్ట్స్ ఉన్నా చేస్తున్న పనిలో అప్ స్కిల్లింగ్ అస్సలు మిస్ కావద్దని అంటున్నారు. అలా చేయకపోతే.. కాలంతో పాటు జీతాలు పెరగకపోగా, మార్కెట్లో మనుగడ సాగించడం కష్టమని టీసీఎస్ టెక్కీ అనుభవం నిరూపిస్తోంది.
