- ఈ నెల 5న ఇద్దరు పిల్లలు సహా అమ్మమ్మ సజీవ దహనం
- భార్య దూరం పెడుతున్నదన్న కోపంతో ముగ్గురిని హత్య చేసిన సవతి తండ్రి
- అర్ధరాత్రి టైంలో పెట్రోల్ పోసి, సిలిండర్ లీక్ చేసి నిప్పు పెట్టిన నిందితుడు
నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఈ నెల 5న సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనమైన ఘటనలో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. మొదట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ముగ్గురు సజీవ దహనమయ్యారని అందరూ భావించారు. కానీ, సిలిండర్ పేలుడు ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్ అని పోలీసులు గుర్తించారు.
భార్య తనను దూరం పెడుతున్నదన్న కోపంతో సవతి తండ్రే పిల్లలతో పాటు వారి అమ్మమ్మను హత్య చేశాడని తేలింది. ఏపీలోని ఒంగోలు సమీపంలో గల కొత్తపేటకు చెందిన శ్రీకాళహస్తి శిరీశ్ కుమార్ మ్యాట్రిమోనీ యాప్ ద్వారా మహిళలను టార్గెట్ చేసి, పెండ్లిళ్లు చేసుకొని, కొంతకాలం కాపురం చేశాక వారి వద్ద ఉన్న నగదు, బంగారం దోచుకొని పరార్ అవుతుంటాడు. ఈ క్రమంలోనే గతంలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రాంతంలో ఓ యువతిని పెండ్లి చేసుకొని, ఆమె వద్ద బంగారం తీసుకొని మిర్యాలగూడకు వచ్చాడు. పట్టణానికి చెందిన నక్క ధనలక్ష్మి (ధనమ్మ) భర్త కొన్నేండ్ల కింద చనిపోవడంతో ఆమెను ఐదేండ్ల కింద రెండో వివాహం చేసుకున్నాడు.
కొంత కాలం కాపురం చేశాక.. ఆదిలాబాద్ కేసులో శిరీశ్ కుమార్ పోలీసులకు చిక్కడంతో ధనమ్మ అతడిని దూరం పెట్టడంతో పాటు ఫోన్ నంబర్ బ్లాక్ చేసింది. తర్వాత తన ఇద్దరు పిల్లలు లక్ష్మణ్(17), ప్రణీత(14)తో కలిసి కలాల్ వాడలోని తల్లి వనం చంద్రమ్మ (55)వద్దకు వచ్చి ఉంటోంది. గత నెలలో జైలు నుంచి విడుదలైన శిరీశ్ కుమార్ వేధింపులు తప్పించుకోవాలన్న ఉద్దేశంతో ధనమ్మ కేర్ టేకర్ ఉద్యోగం కోసం ఇటీవల పుణేకు వెళ్లింది. దీంతో ధనమ్మ తనను వదిలేసి వెళ్లడంతో ఆమెపై శిరీశ్ కుమార్ కక్ష పెంచుకున్నాడు. పిల్లలు అడ్డు తొలగిపోతే ధనమ్మ మళ్లీ తన వద్దకు వస్తుందని భావించి, ఇద్దరు పిల్లలను చంపాలని నిర్ణయించుకున్నాడు.
అర్ధరాత్రి టైంలో పెట్రోల్ పోసి సజీవదహనం
ఇద్దరు పిల్లలను చంపాలని ప్లాన్ చేసిన శిరీశ్ కుమార్ హైదరాబాద్ నుంచి స్కూటీపై మిర్యాలగూడ బయలుదేరాడు. మధ్యలో పెట్రోల్ కొనుగోలు చేశాడు. అర్ధరాత్రి సమయంలో కలాల్ వాడలోని చంద్రమ్మ ఇంటికి చేరుకున్నాడు. అందరూ గాఢ నిద్రలో ఉండడంతో సైలెంట్ గా ఇంట్లోకి చొరబడ్డాడు. పడుకొని ఉన్న లక్ష్మణ్, ప్రణీతతో పాటు వారి అమ్మమ్మ వనం చంద్రమ్మపై పెట్రోల్ పోశాడు. అనంతరం గ్యాస్ సిలిండర్ లీక్ చేసి నిప్పు పెట్టి పరార్ అయ్యాడు. మంటలు ఎగిసిపడడంతో ముగ్గురూ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని ఒంగోలు సమీపంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
