హాలియా, వెలుగు: ఏపీ నుంచి నల్గొండ జిల్లా తిరుమలగిరి( సాగర్)కి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నలుగురిని పెద్దవూర పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ కె. రాజశేఖర్ రాజు వివరాలు తెలిపారు. పెద్దవూర మండలం నాయినివానికుంట తండా శివారులోని సమ్మక్క నీమానాయక్ తండా ఎక్స్‌రోడ్డు వద్దకు పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ కు చెందిన షేక్ గాలిబ్, మంజుల శ్రీను అనే ఇద్దరు వ్యక్తులు గంజాయిని తీసుకొచ్చారు.
తిరుమలగిరి (సాగర్) మండలం శ్రీరామపల్లికి చెందిన దేశం విజయేందర్ రెడ్డి, బరిగల మహేశ్‌కు అమ్ముతున్నారు. గురువారం సాయంత్రం పక్కా సమాచారంతో పెద్దవూర ఎస్ఐ వై. ప్రసాద్సిబ్బందితో వెళ్లి నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరితో పాటు మాచర్ల టౌన్ కు చెందిన కొమ్మెర రమణ, చల్లా పెద్ద ఆంజనేయులుపై కేసు నమోదు చేశారు.
వీరు పరారీలో ఉన్నారు. పట్టుబడిన నిందితుల నుంచి 1500 గ్రాముల (రూ.33 వేల విలువ) గంజాయిని, ఒక బైక్, 3 సెల్ ఫోన్లు, రూ. 2 వేల నగదు స్వాధీనం చేసుకుని నిడమనూరు కోర్టులో రిమాండ్చేశారు. నాగార్జున సాగర్ సీఐ బి. శ్రీను నాయక్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
