మిస్ వరల్డ్ 2024 కిరీటం చెక్ రిపబ్లిక్ కు దక్కింది. ఆ దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. మిస్ వరల్డ్ టైటిల్ కోసం ప్రపంచవాప్తంగా 112 మంది అందాల భామలు పోటీపడ్డారు.
టాప్-4లో క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్), యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), అచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టోబాగో), లీసాగో చోంబో (బోట్స్ వానా)లు నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోటీలో మిస్ వరల్డ్ కిరీటం క్రిస్టినాకు దక్కింది. దీంతో ఎవరీ క్రిస్టినా పిస్కోవా అని నెటిజన్లు సెర్చింగ్ మొదలు పెట్టారు.
క్రిస్టినా పిస్కోవా లా, బిజినెస్లలో రెండు డిగ్రీలు చదువుతుంది. చదువుకుంటూనే మోడల్ గా పలు షోలో పాల్గొంటుంది. క్రిస్టినా అందంతో పాటుగా ఆమె మనసు కూడా అంతే బాగుంటదని చెప్పాలి. పేద పిల్లల కోసం క్రిస్టినా పిస్కోవా అనే ఫౌండేషన్ను కూడా స్థాపించి దానిని రన్ చేస్తుంది.
టాంజానియాలో అణగారిన పిల్లల కోసం ఒక ఆంగ్ల పాఠశాల స్థాపించింది. పిల్లలకు మాత్రమే కాకుండా వృద్ధులకు, మానసిక వికలాంగులకు కూడా సేవలు అందిస్తుంది. ఇక క్రిస్టినా పిస్కోవాకు ఫ్లూట్, వయోలిన్ ప్లే చేయడం అంటే చాలా ఇష్టం. గత తొమ్మిదేళ్లుగా ఆర్ట్ అకాడమీలో ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది.
ఇంగ్లీష్, పోలిష్, స్లోవాక్, జర్మన్ భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన తరువాత క్రిస్టినా చాలా భావోద్వేగానికి గురైంది.
