చార్మినార్ దగ్గర అందాల భామలు.. రెడ్ కార్పెట్తో ఘన స్వాగతం

చార్మినార్ దగ్గర అందాల భామలు.. రెడ్ కార్పెట్తో ఘన స్వాగతం

 ప్రపంచ సుందరీమణులు హైదరాబాద్   పాతబస్తీకి చేరుకున్నారు. చార్మినార్ దగ్గర 109 దేశాల అందగత్తెలకు  రెడ్ కార్పెట్ తో.. సంప్రదాయ అరబ్బీ మర్ఫా సంగీతంతో స్వాగతం పలికారు. చార్మినార్ అందాలను, చుట్టుపక్కల ప్రాంతాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు భామలు. ఆ తర్వాత చార్మినార్‌ దగ్గర ప్రత్యేక ఫోటో షూట్‌నిర్వహించారు. 

మరి కాసేపట్లో  లాడ్ బజార్ లోని తొమ్మిది ప్రముఖ దుకాణాల్లో ఈ సుందరీమణులు షాపింగ్ చేస్తారు. గాజులు, ముత్యాల హారాలు, ఇంకా అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడమే కాక.. అక్కడే గాజులు తయారీ విధానాన్ని కూడా స్వయంగా సుందరీమణులు పరిశీలించనున్నారు. నాలుగు గ్రూపులుగా విడిపోయి ఒక్కో గ్రూప్ రెండు షాప్ లలో షాపింగ్  చేసేలా  ఏర్పాట్లు చేశారు. అనంతరం  చార్మినార్  నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. 

హెరిటేజ్ వాక్ కు అంతరాయం కలుగకుండా ట్రాఫిక్ డైవర్షన్ విధించారు పోలీసులు.  పహెల్గాం  ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో  పాతబస్తీ వీధులన్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదీనా, చార్మినార్, శాలిబండ, వొల్గా జంక్షన్, ఖిల్వత్ రోడ్లను పూర్తిగా క్లోజ్ చేశారు. ఇవాళ రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.