
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మే 14న వరంగల్ వెళ్లనున్నారు. వెయ్యిస్తంభాల గుడి, పోర్ట్, యునెస్కో వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయాన్ని సందర్శించి, అక్కడే పేరిణీ నృత్యాన్ని తిలకించనున్నారు. వరంగల్లోని వేయి స్తంభాల గుడి కాకతీయుల కళాత్మక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక అద్భుత కట్టడం. తెలంగాణలోనే అత్యంత పురాతమైన దేవాలయంగా పేరు గాంచింది. ఈ ఆలయం 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది.
ఓరుగల్లులో 4.35 నుంచి 9 గంటల వరకు..
ఉమ్మడి వరంగల్ పర్యటనలో భాగంగా మే 14న మిస్ వరల్డ్ బ్యూటీస్ 56 మందితోపాటు వారి కేర్‍టేకర్లున్నారు. జిల్లాలో మొత్తం పర్యటన దాదాపు 4.30 గంటల నుంచి 5 గంటల్లో పూర్తి కానుంది. 14న సాయంత్రం 4.35 గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ చేరుకుంటారు. వారికి సాంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలుకుతారు. 5.30 హోటల్ నుంచి బస్సు ద్వారా రెండు బ్యాచ్‌లుగా విడిపోయి 30 మంది రామప్ప టెంపుల్, మరో బ్యాచ్ వెయ్యిస్తంభాల గుడి, ఖిలా వరంగల్ పర్యటనకు వెళ్తారు. ఇది ముగిశాక రాత్రి 7.55 నుంచి 8.15 మధ్యన రెండు గ్రూపులు తిరిగి హరిత హోటల్ చేరుకుంటాయి. మటన్, నాటుకోడి చికెన్, బోటి, తలకాయ, పాయ వంటి తెలంగాణ స్పెషల్ వంటకాలతో డిన్నర్ అనంతరం సుమారు 9 గంటలకు హైదరాబాద్ తరలివెళ్తారు.
వరంగల్ పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఖిల్లా వరంగల్ దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు వరంగల్ జిల్లాల కలెక్టర్ డాక్టర్ సత్య శారద, పోలీస్ అధికారులు. ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ షో బోట్, పలు శాఖల అధికారులతో ఏర్పాట్లు పరిశీలించారు. హరిత కాకతీయ, వేయి స్తంభాల దేవాలయం, ఖిలా వరంగల్ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు. మూడు చోట్ల పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించార కలెక్టర్ సత్య శారద.
యాదగిరిగుట్ట, పోచంపల్లి
15వ తేదీన యాదగిరిగుట్టను సందర్శించనున్నారు. పోచంపల్లిలోని చేనేత వస్త్రాల తయారీని తెలుసుకోవడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తారు. ఈ వస్త్రాలు, ముఖ్యంగా ఇక్కత్ (ఇకత్) చీరలు, సంప్రదాయ జ్యామితీయ నమూనాలు..అద్భుతమైన నేత కళకు ప్రసిద్ధి. అందాల తారలు అత్యంత ప్రసిద్ధి గాంచిన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు తిలకించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. తద్వారా తెలంగాణ ప్రపంచానికే పరిచయం చేసేలా ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తున్నది.