
- మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను రెండు బృందాలుగా విడదీసి పోటీలు
- నేడు యూరప్, ఆసియా, ఓషియానియా టీమ్ ప్రాజెక్టులతో షో
హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో మంగళవారం హెడ్- టు-హెడ్ చాలెంజ్ పోటీలు ప్రారంభమయ్యాయి. హెడ్ టు హెడ్ చాలెంజ్ కోసం పోటీదారులను రెండు బృందాలుగా విభజించారు. తొలిరోజు అమెరికా, కరీబియన్, ఆఫ్రికా దేశాల కంటెస్టెంట్లు తమ ఆలోచనలు పంచుకుంటూ పర్యావరణ పరిరక్షణ, మానసిక ఆరోగ్యం, జెండర్ వయొలెన్స్, సౌర శక్తి, ప్లాస్టిక్ కాలుష్యం, ఆటిజం, డ్రగ్స్ వ్యతిరేక విద్య, భాషా సంరక్షణ, బాలల విద్య వంటి అంశాలపై తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు.
మిస్ వరల్డ్ కాంపిటీషన్ కు పెట్టిన ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ అనే థీమ్‌తో తమ గొంతుకను వినిపించారు. భారత్ తరఫున పాల్గొన్న మిస్ ఇండియా నందిని గుప్తా తన ప్రాజెక్ట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. బుధవారం యూరప్, ఆసియా, ఓషియానియా ప్రతినిధులు వేదికపై తమ ఆలోచనలను పంచుకోవడంతోపాటు ప్రాజెక్టులను పదర్శించనున్నారు. ఈ ఈవెంట్ ను మిస్ వరల్డ్ యూట్యూబ్ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. కాగా, మిస్‌వరల్డ్ పోటీలు ఈ నెల 31 వరకు గచ్చిబౌలి స్టేడియంలో కొనసాగనున్నాయి. ఫైనల్‌కు నలుగురు పోటీదారులను ఖండాలవారీగా ఎంపిక చేయనున్నారు.
ప్రపంచం దృష్టికి తెలంగాణ టూరిజం: మిస్‌వరల్డ్ సీఈవో
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం ద్వారా సేవారంగంలో ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇవ్వనున్నామని మిస్ వరల్డ్ సంస్థ చైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లీ అన్నారు. తెలంగాణ పర్యాటకాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అందాల పోటీలను ఇక్కడ నిర్వహించడం పట్ల చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఈ పోటీలు కేవలం అందాన్ని ప్రదర్శించడానికే కాదని, అందమైన విజయాలు సాధించడానికి, మహిళలకు అందమైన స్ఫూర్తి కలిగించడానికి కూడా ఒక వేదిక అని అన్నారు.
కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ సెంటర్‌ను సందర్శించిన పోటీదారులు
పద్మారావునగర్,వెలుగు: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట కృష్ణానగర్ కాలనీలోని కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ ను మంగళవారం మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు సందర్శించారు. వీరికి కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు స్వాగతం పలికారు. ఆసుపత్రిలో పేషంట్లకు అందిస్తున్న వైద్య సేవల గురించి కంటెస్టెంట్లు అడిగి తెలుసుకున్నారు.