వాసాలమర్రిలో బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ మిస్‌‌‌‌

వాసాలమర్రిలో బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ మిస్‌‌‌‌
  • మరుసటి రోజు పోలింగ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ బయట కనిపించిన పేపర్‌‌‌‌
  • ఇద్దరు సర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్లకు సమాన ఓట్లు.. డ్రా ద్వారా ఫలితం
  • దొరికిన బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌తో కలెక్టర్, ఈసీకి ఫిర్యాదు చేసిన ఓడిన క్యాండిడేట్‌‌‌‌

యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఓ బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ మిస్‌‌‌‌ అయిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలో సర్పంచ్‌‌‌‌ బరిలో నిలిచిన ఇద్దరు క్యాండిడేట్లకు సమాన ఓట్లు రావడంతో డ్రా పద్ధతిలో విజేతను నిర్ణయించారు. కాగా, ఓడిన క్యాండిడేట్‌‌‌‌ బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ మిస్‌‌‌‌ అయిన ఘటనపై కలెక్టర్‌‌‌‌, ఈసీకి ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది.

 వివరాల్లోకి వెళ్తే... వాసాలమర్రి గ్రామ పంచాయతీకి మొదటి విడతలో ఎన్నికలు జరుగగా... కాంగ్రెస్‌‌‌‌ మద్దతుతో దొమ్మాట అనురాధ, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సపోర్ట్‌‌‌‌తో పలుగుల ఉమారాణి పోటీ చేశారు. ఈ గ్రామంలో మొత్తం 1,301 ఓట్లు ఉండగా.. పోస్టల్‌‌‌‌ బ్యాలెట్‌‌‌‌తో కలిసి 1,235 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 14 ఓట్లు చెల్లకుండా పోగా.. మరో మూడు ‘నోటా’కు పడ్డాయి. 

గ్రామంలో రెండో వార్డులో 119 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్​ ముగిసిన తర్వాత లెక్కింపు ప్రారంభించగా.. వార్డు మెంబర్‌‌‌‌కు సంబంధించిన బ్యాలెట్‌‌‌‌ బాక్స్‌‌‌‌లో 119 పేపర్లు ఉండగా, సర్పంచ్‌‌‌‌ బాక్స్‌‌‌‌లో 118 బ్యాలెట్‌‌‌‌ పేపర్లు మాత్రమే కనిపించాయి. మిస్‌‌‌‌ అయిన బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ కోసం ఎంత వెదికినా కనిపించలేదు. ఇదిలా ఉండగా.. సర్పంచ్‌‌‌‌గా పోటీ చేసిన అనురాధ, ఉమారాణికి చెరో 609 ఓట్లు వచ్చాయి. 

అనంతరం రెండు మార్లు రీకౌంటింగ్‌‌‌‌ చేసినా ఓట్లలో మార్పు రాలేదు. దీంతో డ్రా తీయడానికి ఆఫీసర్లు ప్రయత్నించగా.. ఓ బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ కనిపించక పోవడంతో ఇద్దరు అభ్యర్థులు మొదట డ్రాకు ఒప్పుకోకపోగా.. కొద్దిసేపటి తర్వాత ఓకే అన్నారు. దీంతో ఆఫీసర్లు డ్రా తీయగా.. అనురాధకు అనుకూలంగా రావడంతో ఆమె సర్పంచ్‌‌‌‌గా గెలిచినట్లు ఆఫీసర్లు ప్రకటించారు. 

కాగా, ఎన్నిక రోజున మిస్‌‌‌‌ అయిన బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ మరుసటి రోజు.. పోలింగ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ బయట కనిపించింది. బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌లో పలుగుల ఉమారాణికే ఓటు పడినట్లు ఉంది. దీంతో ఆమె ఆ బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ తీసుకొని సోమవారం కలెక్టర్‌‌‌‌ హనుమంతరావుకు, అనంతరం హైదరాబాద్‌‌‌‌కు వెళ్లి ఎన్నికల కమిషన్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. మిస్‌‌‌‌ అయిన ఓటు తనకే పడినందున.. డ్రాలో గెలిచిన అనురాధను తొలగించి తనను సర్పంచ్‌‌‌‌గా ప్రకటించాలని కోరారు. తనకు న్యాయం జరగని పక్షంలో కోర్టు ఆశ్రయిస్తానని ఉమారాణి తెలిపారు.