బతుకు భారంగా మారింది.. ఇక్కడితో ముగిస్తున్నా: యమునలో తేలిన ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్

బతుకు భారంగా మారింది.. ఇక్కడితో ముగిస్తున్నా: యమునలో తేలిన ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్

న్యూఢిల్లీ: ‘జీవితం భారంగా మారింది, ఈ జీవితాన్ని ఇక్కడితో ముగించాలని నిర్ణయించుకున్నా..’ అంటూ లెటర్ రాసి పెట్టి ఓ విద్యార్థి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. చివరకు వారం రోజుల తర్వాత ఆదివారం రాత్రి స్టూడెంట్ మృతదేహాన్ని యమునా నది ఒడ్డున గుర్తించారు. సిగ్నేచర్ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. బలవన్మరణానికి పాల్పడిన యువతిని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ దేబ్ నాథ్ (19) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఫ్రెండ్‎ను రైలెక్కిస్తానని వెళ్లి తిరిగిరాలే.. 

త్రిపురకు చెందిన స్నేహా ఉన్నత విద్య కోసం ఢిల్లీకి వచ్చింది. ఈ నెల 7న తన ఫ్రెండ్‎ను డ్రాప్ చేయడానికి సరాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్‎కు వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని, అప్పటి నుంచి స్నేహ ఆచూకీ తెలియడం లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తోందన్నారు. ‘‘జీవితంలో ఫెయిల్ అయినట్లు అనిపిస్తున్నది. బతుకు భారమనిపిస్తోంది. ఇంతటితో ఈ జీవితాన్ని  ముగిస్తున్నా. సిగ్నేచర్  బ్రిడ్జిపై నుంచి దూకి చనిపోవాలని నిర్ణయించుకున్నా. ఇది పూర్తిగా నా నిర్ణయమే” అని రాసి ఉన్న లెటర్​ స్నేహ గదిలో దొరికిందన్నారు.

బ్రిడ్జి వద్ద పనిచేయని సీసీటీవీ కెమెరాలు

సిగ్నేచర్ బ్రిడ్జి వద్ద స్నేహ కోసం ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి సీసీటీవీ కెమెరాలు పనిచేయడంలేదని వాపోయారు. ఈ విషయంపై త్రిపుర సీఎం మాణిక్ సాహా కూడా స్పందించారు. స్నేహ ఆచూకీ కనుగొనాలని అధికారులను ఆయన ఆదేశించారు. ‘‘తన ఫ్రెండ్‎ను సరాయ్ రోహిల్లా స్టేషన్‎లో డ్రాప్  చేయడానికి వెళ్తున్నానని ఈ నెల 7న ఉదయం 5.56 గంటలకు స్నేహ నాకు ఫోన్ చేసింది. తర్వాత 8.45 గంటలకు ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. 

అయితే, స్నేహ ఆరోజు ఉదయం తన ఫ్రెండ్​ను కలవలేదని తెలిసింది. ఆమెను డ్రాప్  చేసిన క్యాబ్ డ్రైవర్​ను సంప్రదించగా.. రోహిల్లా రైల్వే స్టేషన్  బదులు సిగ్నేచర్ బ్రిడ్జి వద్ద డ్రాప్  చేశానని అతను చెప్పాడు” అని యువతి తల్లి వెల్లడించింది. కాగా, ఢిల్లీ క్రైం బ్రాంచ్ రిక్వెస్ట్​తో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్.. స్నేహ ఆచూకీ కోసం నదిలో తీవ్రంగా గాలించింది. ఏడు కిలోమీటర్ల వరకు గాలించినా స్నేహ ఆచూకీ దొరకలేదని పోలీసులు తెలిపారు.