
కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆలయంలో బంగారం మాయమవ్వడం కలకలం రేపింది. బంగారపు పూత నిమిత్తం ఆలయంలో ఉంచిన 100 గ్రాముల బంగారు రాడ్లు మాయమైనట్లు వార్తలొచ్చాయి. శనివారం ( మే 10 ) ఆలయంలో బంగారపు పూత పనులు జరిగాయని.. ఆ తర్వాత బంగారాన్ని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచే సమయంలో బంగారు రాడ్లు మిస్ అయినట్లు గుర్తించామని తెలిపారు ఆలయ సిబ్బంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే.. ఆలయ స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల బంగారం చోరీకి సంబంధించి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు పోలీసులు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చోరీ వెనక ఆలయ సిబ్బంది హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కానీ అసలు విషయం ఏంటంటే.. బంగారం పూత పనుల తర్వాత తిరిగి స్ట్రాంగ్ రూమ్ కి తీసుకెళ్లే సమయంలో బంగారు రాడ్లు ఆలయ ఆవరణలోనే పడిపోయాయని.. అవి చోరీకి గురికాలేదని స్పష్టం చేశారు పోలీసులు. మొత్తానికి చోరీకి గురయ్యిందనుకున్న బంగారం దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు ఆలయ అధికారులు, సిబ్బంది.
►ALSO READ | బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్టెంపుల్లో రమణీయం నారసింహుడి పరిణయం
అనంత పద్మనాభస్వామి ఆలయంలో బంగారం చోరీకి సంబంధించి గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. 2015లో సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆడిట్ లో 266 కిలోల బంగారం కనిపించకుండా పోయినట్లు తెలిపారు ఆలయ అధికారులు. ఆలయ అలంకరణ కోసం బంగారాన్ని బయటకు తీసిన సమయంలో మాయమైనట్లు తెలిపారు. 2017ల కూడా రూ.189 కోట్ల విలువైన బంగారం, ఎనిమిది పురాతన వజ్రాలు కనిపించకుండా పోయినట్లు సుప్రీం కోర్టుకు తెలిపారు ఆలయ అధికారులు. ఈ ఘటనలపై కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయ సంపద రూ. 1.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా ఉంది. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయ నేలమాళిగల్లోని ఆరు గదులలో ఐదింటిని తెరవగా.. వీటిలో భారీగా బంగారం, వజ్రాలు, రత్నాలు బయటపడ్డాయి.