మిస్టరీగా మారిన టీచర్ మిస్సింగ్

మిస్టరీగా మారిన టీచర్ మిస్సింగ్

మెదక్: టీచర్ మిస్సింగ్ మిస్టరీగా మారింది. సిద్ధిపేటలో నివాసం ఉండే ఆకుల కరీముల్లా మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం వెంకట్రావ్ పేట ప్రైమరీ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. ఆయన మండల కేంద్రమైన అల్లాదుర్గంలో ఒక రూమ్ కిరాయికి తీసుకొని ఉంటున్నారు. గతనెల 28వ తేదీన ఆయన ఇంటి ఓనర్ కు స్వంత గ్రామం సిద్దిపేట వెళ్తున్నానని చెప్పి వెళ్లారు. అయితే ఆయన అటు సిద్దిపేటలోని ఇంటికి చేరుకోలేదు. ఇటు అల్లాదుర్గంలోని రూమ్ కు తిరిగి రాలేదు. 18 రోజులు కావాస్తున్నాకరీముల్లా ఆచూకీ లభించలేదు.

తోటి టీచర్లందరూ ఆయన స్వంత ఊరికి వెళ్లి ఉంటారని బావించారు. అయితే రెండు మూడు రోజులకు ఒకసారి తమతో ఫోన్లో మాట్లాడే కరీముల్లా నుండి చాలా రోజులుగా ఫోన్ రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలువకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. అయినా ఆచూకీ లభించ లేదు. దీంతో వారి స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు వెళ్లాడేమోనని అక్కడ బంధువులను కనుక్కోగా అక్కడికీ రాలేదని తెలిసింది. దీంతో మూడు రోజుల తరువాత కరీముల్లా తమ్ముడు చందు అల్లాదుర్గం వచ్చి స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అల్లాదుర్గం ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. 
ఆర్థిక ఇబ్బందులే కారణమా?
కరీముల్లా మిస్సింగ్ కారణమేంటనే దాని గురించి అల్లాదుర్గం పోలీసులు పలు కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఐపీఎల్ బెట్టింగ్లతో లాస్ కాగా, క్రెడిట్ కార్డ్ ల భారం పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులు పెరగడం  కరీముల్లా మిస్సింగ్కు కారణమని అనుమానిస్తున్నారు. అతను తన సెల్ ఫోన్, క్రెడిట్ కార్డులు అన్నీకిరాయికి ఉండే రూంలో వదిలేసి వెళ్లడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుందంటున్నారు. అయితే ఇంకా విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.