
నిర్మల్, వెలుగు: ఇన్నాళ్లూ పైపులైన్ల పగుళ్లు, లీకులతో రోజుల కొద్దీ మిషన్ భగీరథ నీళ్లు నిలిచిపోవడం చూశాం.. కానీ కొత్తగా జీతాలు ఇవ్వక స్టాఫ్సమ్మెకు దిగడంతో వారం, పది రోజులుగా వాటర్ నిలిచిపోయిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. భగీరథ కడెం గ్రిడ్‌లో పని చేస్తున్న దాదాపు 100 మంది క్షేత్రస్థాయి సిబ్బంది పది రోజుల నుంచి వేతనాల కోసం సమ్మె బాట పట్టారు. వీరంతా డ్యూటీలకు వెళ్లకుండా ఆందోళన చేస్తుండడంతో గ్రిడ్ పరిధిలోని మూడు మండలాల్లో సుమారు వంద గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటి కోసం జనం ఇబ్బందులు పడ్తున్నారు.
ఐదు నెలలుగా జీతాల్లేక సమ్మెలోకి..
కడెం గ్రిడ్ పరిధిలో నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్, జన్నారం, కడెం మండలాలతో పాటు పెంబి, ఖానాపూర్ మండలాల్లోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రిడ్‌ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే పీఎల్ఆర్అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ మరో సబ్‌కాంట్రాక్టర్‌కు పనులు అప్పజెప్పింది. ఈ సబ్‌కాంట్రాక్టర్ గ్రిడ్‌లో పనిచేసే వాటర్ లైన్మెన్లు, సూపర్వైజర్లు తదితర సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. రూల్ ప్రకారం ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ. 15,212 చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ. 7 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఆ వేతనం కూడా ఐదు నెలలుగా ఇవ్వకపోవడంతో ఖానాపూర్ఎమ్మెల్యే రేఖానాయక్, మిషన్ భగీరథ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో గత్యంతరం లేక సమ్మెకు దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు.
నీటి సరఫరాకు ఆటంకాలు
సిబ్బంది సమ్మె వల్ల కడెం, దస్తూరాబాద్, జన్నారం మండలాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పెంబి, ఖానాపూర్ మండలాల్లోని కొన్ని గ్రామాలకు కూడా వాటర్సప్లై బంద్అయింది. దీంతో వారం, పదిరోజులుగా వంద గ్రామాల్లో తాగునీటి కోసం జనం తిప్పలు పడుతున్నారు. చాలామంది బోరు నీళ్లు తాగుతుండగా, కొందరు మినరల్వాటర్కు ఎగబడ్తున్నారు. ఇదే అదనుగా మినరల్ వాటర్ రేట్లు పెంచి అమ్ముతున్నారు. ఇటీవల అధికవర్షాల వల్ల బోరువాటర్ కలుషితమైందని, తద్వారా వైరల్ ఫీవర్స్‌తో పాటు వివిధ రోగాలు వచ్చే ప్రమాదముందనే భయాందోళన వ్యక్తమవుతోంది.
త్వరలోనే పరిష్కరిస్తాం
మిషన్ భగీరథ సిబ్బంది ఐదు నెలల వేతనాల కోసం సమ్మె చేస్తున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. రెండు రోజుల క్రితం సబ్ కాంట్రాక్టర్ వచ్చి సిబ్బందితో చర్చించారు. ఈ నెలాఖరులోగా సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– వెంకటరమణ, డీఈ, మిషన్ భగీరథ, కడెం గ్రిడ్
ఎనిమిది దినాలుగా నీళ్లొస్తలేవ్
ఎనిమిది రోజులుగా తాగే నీళ్లు వస్తలేవు. నల్లాలు పని చేస్తలేవు. సర్పంచ్, ఆఫీసర్లకు సమస్య చెప్పినం. ఇప్పుడు బోరుబావి నీళ్లు తాగుతున్నం. నల్లా నీళ్లు ఎప్పుడొస్తయంటే ఎవలూ చెప్తలేరు.
– శనిగారపు నర్సవ్వ, కన్నాపూర్, కడెం మండలం
ఆఫీసర్లు పట్టించుకుంటలేరు
మొన్నటి దాకా వర్షాలు, వరదలు అంటూ భగీరథ నీళ్లు బంద్పెట్టిన్రు. మధ్యలో కొద్దిరోజులు ఇచ్చి మళ్లీ వారం రోజుల నుంచి సప్లై పూర్తిగా ఆపేసిన్రు. మా సమస్య ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంటలేరు. భగీరథ సిబ్బంది సమ్మె చేస్తున్నరని చెప్తున్నరు. సిబ్బంది సమ్మె చేస్తే మా గొంతు ఎండల్నా?
– బొంతల లక్ష్మీరాజం, కన్నాపూర్, కడెం మండలం