
భగీరథ సబ్ కాంట్రాక్టర్ల హెచ్చరిక
వర్క్ ఏజెన్సీ ఆఫీసు ఎదుట ధర్నా
బిల్లులివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని మిషన్ భగీరథ సబ్ కాంట్రాక్టర్లు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ వర్క్ ఏజెన్సీ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. జీవీపీఆర్ అనే సంస్థ భగీరథ ట్యాంకుల కాంట్రాక్టు దక్కించుకుంది. ఆ సంస్థ నుంచి ఆనంద్‌రావు, శంకర్ అనే వ్యక్తులు సబ్ కాంట్రాక్టు తీసుకొని సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనంతారం, సూర్యాపేట మండలం కుసుమవారిగూడెం గ్రామాల్లో 40 కిలో లీటర్ల సామర్థ్యం గల రెండు ట్యాంకులను నిర్మించారు. వీటి నిర్మాణానికి రూ.1.26 కోట్ల ఖర్చు కాగా ఇప్పటి వరకు రూ.80 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగతా రూ.46 లక్షలు చెల్లించాలని 18 నెలలుగా వర్క్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతున్నా బిల్లు ఇవ్వడంలేదు.
దీంతో ఆగ్రహించిన సబ్ కాంట్రాక్టర్లు కుటుంబ సభ్యులతో సహా వర్క్ ఏజెన్సీ ఆఫీసు వద్దకు కిరోసిన్ బాటిళ్లతో వచ్చి ధర్నా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారి వద్ద గల కిరోసిన్ క్యాన్ స్వాధీనం చేసుకొని భగీరథ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆందోళన చేస్తున్న వారిని ఎర్రమంజిల్‌లోని భగీరథ హెడ్‌క్వార్టర్స్‌కు తీసుకువచ్చారు. తాము పనులు అప్పగించిన జీవీపీఆర్ సంస్థకు ఎలాంటి బిల్లులు పెండింగ్ లేవని భగీరథ అధికారులు వివరించారు. వర్క్ ఏజెన్సీ నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవాలని వారికి సూచించారు.