- వారికి షోకాజ్ ఇచ్చి చర్యలు తీసుకోండి
- డీఎంఈ వాణికి డీహెచ్ రవీందర్ నాయక్ లేఖ
హైదరాబాద్, వెలుగు: స్టాఫ్ నర్సుల సీనియారిటీ లిస్ట్, వేకెన్సీ పోస్టుల లిస్టులో అవకతవకలకు ప్రభుత్వ దవాఖాన్ల సిబ్బందే కారణమని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ) వాణికి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్(డీహెచ్) రవిందర్ నాయక్ లేఖ రాశారు. డీఎంఈ పరిధిలో ఉన్న మొత్తం 23 హాస్పిటళ్ల నుంచి తమకు తప్పుడు సమాచారం ఇచ్చారని లేఖలో తెలిపారు. తప్పుడు సమాచారం వల్లే కౌన్సిలింగ్ ప్రక్రియలో గందరగోళం తలెత్తి నర్సులు ఆందోళన చేశారని చెప్పారు.
ఆయా హాస్పిటళ్లలో నర్సింగ్ డివిజన్ వ్యవహారాలు చూసే అడ్మినిస్ట్రేషన్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని డీఎంఈని కోరారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని వివరాలను రెండ్రోజుల్లో తనకు అందజేయాలని సూచించారు. డీహెచ్ పేర్కొన్న లిస్టులో గాంధీ, ఎంఎన్‌జే, ఉస్మానియా, ఈఎన్టీ, పీవర్, సరోజినిదేవి, టీబీ, చెస్ట్, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ హాస్పిటల్, పెట్లబుర్జు, డెంటల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు, వరంగల్‌లోని నర్సింగ్ కాలేజీ, ఎంజీఎం, హన్మకొండ జీఎంహెచ్ సహా పలు దవాఖాన్లు ఉన్నాయి. ఇటీవల డీహెచ్ ప్రకటించిన స్టాఫ్ నర్సుల సీనియార్టీ, వేకెన్సీ లిస్టులో తప్పులు ఉండడంతో నర్సులు ఆందోళన చేశారు. దీంతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. మంగళవారం రాత్రి మరోసారి రివైజ్డ్ జాబితాలు ప్రకటించారు. బుధవారం నుంచి కౌన్సెలింగ్
నిర్వహించనున్నారు.
శాఖల మధ్య సమన్వయ లోపం
ఈ వ్యవహారంతో ఆరోగ్యశాఖలో పలు విభాగాల మధ్య ఉన్న సమన్వయ లోపం అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడిందని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏండ్ల తర్వాత జరుగుతున్న ట్రాన్స్ఫర్ల ప్రక్రియలో అనేక తప్పులు జరుగుతున్నాయని చెప్పారు. ఆయా విభాగాల హెచ్వోడీలకు డిపార్ట్‌మెంట్‌పై పట్టు, అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. జరిగిన తప్పును సవరించడం కంటే ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం డిపార్ట్మెంట్ పరువును మరింత దిగజార్చేలా ఉందంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించాలని, సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
