
- మున్సిపాలిటీల్లో వెలుగు చూసిన అవకతవకలు
- కులాల సర్వేపై అనుమానాలు
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
నల్లగొండ, వెలుగు:మున్సిపాలిటీల్లో ఓటరు లిస్ట్‌లు తప్పుల తడకగా మారాయి. వీటి ఆధారంగా చేపట్టిన కులాల వారీ ఓటర్ల సర్వే పైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అవకతవకలే మళ్లీ చోటుచేసుకున్నట్లు పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. గ్రామీణ ఓటర్లను, పట్టణ ఓటర్లుగా చిత్రీకరించే ప్రయత్నం తెరవెనక జరుగుతోందంటున్నాయి. గతేడాది చేపట్టిన కుల గణనలో లోపాలు చూపినప్పటికీ ఆఫీసర్లు సరి చేయకపోవడం అనుమానాలకు బలమిస్తోంది.
త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు మరోసారి కులాల వారీగా ఓటర్ల సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండో సర్వేతో మున్సిపాలిటీల్లో ఓటర్లు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. 2018 ఓటరు లిస్ట్ ప్రకారం గతేడాది చివర్లో కులగణన చేశారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో కొత్తగా మరికొంత మంది ఓటర్లు జాబితాలో చేరారు. దీంతో ఇప్పుడు సర్వే చేస్తే అదనంగా 15 శాతం ఓటర్లు పెరుగుతారని అంచనా. అయితే కొత్తగా చేరిన ఓటర్లలోనే గందరగోళం నెలకొందని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. వారిలో చాలా మంది అటు గ్రామాల్లో, ఇటు పట్టణాల్లో రెండు చోట్ల ఓటరుగా ఉన్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ రకంగా నమోదైన బోగస్ ఓటర్లను తొలగించే సాఫ్ట్వేర్ ఇప్పుడు అందుబాటులో లేదు.
రాజకీయ ప్రయోజనాలే…
రాజకీయ ప్రయోజనాల కోసమే మున్సిపాలిటీలో బోగస్ ఓటర్లును చేరుస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు దొడ్డిదారి ప్రయత్నాలకు దిగినట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో రెండొందల మందికి పైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని రాజకీయ పార్టీలు ఆధారాలు చూపిస్తున్నాయి. వీరిలో చాలా మంది దామరచర్ల మండ లానికి చెందిన వారు కాగా, మరికొంత మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారని అంటున్నారు. ఎంపీ ఎన్నికలప్పుడు మున్సిపాలిటీ ఓటరు జాబితాలో ఉన్న వారే తిరిగి లోకల్‌బాడీ ఎన్నికల్లో దామరచర్ల మండలంలో ఓటర్లుగా నమోదయ్యారని ఫిర్యాదు చేశారు. నల్లగొండ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌కు క్లిష్టమని భావించే వార్డుల్లో కూడా బోగస్ ఓటర్లను తొలగించలేదంటున్నారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన చిట్యాల మున్సిపాలిటీలో బీసీ ఓటర్లను ఓసీలుగాను, ఓసీలను బీసీ ఓటర్లుగా చూపారు. కొత్త మున్సిపాలిటీలైన నందికొండ, హాలియా, చండూరు, చిట్యాలలో ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందంటున్నారు. శివారు గ్రామాలను కలిపి మున్సిపాలిటీలుగా మార్చడంతో ఓటర్లను గుర్తిం చడం కష్టంగా మారింది. సిబ్బంది కొరత, ఇతర శాఖల అధికారులకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో కొత్త మున్సిపాలిటీలో కులగణన గందరగోలంగా మారింది.
మొక్కుబడి సర్వే…
ప్రస్తుత సర్వే వచ్చే నెల 19 నాటికి పూర్తవుతుంది. ఇందులో బోగస్ ఓటర్లను తొలగించడం లేదు. కేవలం కులాల వారీగా ఎంత మంది ఓటర్లు ఉన్నారనే దానిపైనే సర్వే జరుగుతుంది.అది కూడా మొక్కుబడిగానే సాగుతోందంటున్నారు. బోగస్ ఓటర్లను తొలగించాలంటే శాసనసభ, లోక్ సభ ఎన్ని కల్లో ఉపయోగించిన సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకొస్తే తప్ప సాధ్యం కాదని అధికారులు అంటున్నారు.
ఫిర్యాదు చేస్తే తొలగిస్తాం
డబుల్ ఓట్లు ఉండటం, ఇతర ప్రాంతాలవారికి ఇక్కడ ఓటు హక్కు కల్పించి నవిషయం నా దృష్టికి రాలేదు. రెం డు ఓట్లునమోదై ఉండటం చట్ట విరుద్ధం. డబుల్ఓట్లపై ఫిర్యాదు చేస్తే తగిన చర్యలుతీసుకుంటాం . పకడ్బందీగా ఓటర్ల జాబితాతయారు చేస్తాం.- ఆర్డీవో జగన్నాథరావు, మిర్యాలగూడ