
- 430 కోట్లతో ఆరు లైన్ల బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవల మున్సిపల్ శాఖ అనుమతులు
హైదరాబాద్, వెలుగు: బెంగళూరు నేషనల్ హైవే (ఎన్‌హెచ్44)ని చింతల్‌మెట్ రోడ్డుకు అనుసంధానం చేసేలా మీరాలం ట్యాంకు వద్ద నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జికి త్వరలో టెండర్లు పిలవనున్నారు. రూ.430 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవల మున్సిపల్ శాఖ సెక్రటరీ ఇలంబర్తి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మీరాలం ట్యాంకు సుందరీకరణలో భాగంగా లేక్ ఫ్రంట్ డెవలప్ మెంట్ తోపాటు టూరిజంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ సుందరీకరణలో భాగంగానే ఈ ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించాలని నిర్ణయించారు.
టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి మూసీ రివర్ డవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు మూసీ నాలా విస్తరించేందుకు భూసేకరణ చేయాల్సి ఉంది. ఓల్డ్ సిటీలో ఆస్తుల సేకరణ, యజమానులను ఒప్పించడం, వారికి పరిహారం ఇప్పించే ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేందుకు గతంలో చార్మినార్ జోనల్ కమిషనర్ గా చాలా ఏండ్లు పనిచేసిన శ్రీనివాస్ రెడ్డికి ఎంఆర్డీసీఎల్ అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఈయన ఎంఆర్డీసీఎల్ ఈడీగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో కీలకంగా పనిచేస్తున్నారు.