
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
హాలియా, వెలుగు : నైస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం నాగార్జునసాగర్ లోని నందికొండ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, నైస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్యత, అవగాహన లోపం, పౌష్టికాహారం సరిగా తీసుకోకపోవడం, జబ్బులకు సకాలంలో చికిత్స తీసుకోకపోవడం, రక్తహీనత తదితర సమస్యలతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
గిరిజనుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నైస్ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. నైస్ సంస్థ తన సేవలందించేందుకు చందంపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని అక్కడి సమస్యలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని కోరారు. దేవరకొండ డిప్యూటీ డీఎంహెచ్ వో, మిర్యాలగూడ ఇన్చార్జి డిప్యూటీ డీఎంహెచ్ వో రవిని నోడల్ అధికారిగా నియమించామని తెలిపారు.
అనంతరం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ సందర్శించి పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవల గురించి అండిగి తెలుసుకున్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, డీఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్, డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి చత్రునాయక్, రిచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రష్మీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.