కేసీఆర్ పాలనలోనూ తప్పులు జరిగి ఉండొచ్చు... నిరుద్యోగుల ప్రశ్నకు కవిత స్పందన

కేసీఆర్ పాలనలోనూ తప్పులు జరిగి ఉండొచ్చు... నిరుద్యోగుల ప్రశ్నకు కవిత స్పందన

ముషీరాబాద్, వెలుగు: కేసీఆర్​పాలనలోనూ అవకతవకలు జరిగాయి కదా.. గత ప్రభుత్వంలో ఏం చేశారని జాగృతి అధ్యక్షురాలు కవితను నిరుద్యోగులు ప్రశ్నించారు. గ్రూప్–1 రిక్రూట్​మెంట్​పై వస్తున్న ఆరోపణలపై చర్చించేందుకు మంగళవారం సాయంత్రం చిక్కడపల్లి సిటీ సెంట్రల్​లైబ్రరీకి వచ్చిన ఆమెను నిలదీశారు. దీనిపై కవిత స్పందిస్తూ.. ఆనాడైనా, ఈనాడైనా నిరుద్యోగులకు న్యాయం జరగాలనే కోరుకుంటున్నానన్నారు. 

గత ప్రభుత్వంలో తాను భాగస్వామినే.. తమ వల్ల తప్పు జరిగి ఉండొచ్చు.. మనందరం తెలంగాణ వాళ్లం.. దాన్ని మనమే సరిదిద్దుకోవాలి.. కానీ, ఈ ప్రభుత్వం ఆంధ్రావాళ్లకు తల వంచిందని విమర్శించారు. గ్రూప్–1 ఎగ్జామ్ ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 

గ్రూప్–1 లో ఏపీకి చెందిన 8 మంది అభ్యర్థులు ఎలా సెలెక్ట్ అవుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే ఉద్యోగాలు వచ్చిన వారి పేపర్లు బయట పెట్టడానికి భయమెందుకన్నారు. అంతకుముందు లైబ్రరీకి చేరుకున్న కవితను పోలీసుల అడ్డుకున్నారు. దీంతో జాగృతి నాయకులు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేటు వద్ద బైఠాయించారు.