‘కల్యాణ లక్ష్మి’ వస్తలేదన్నందుకు.. ఊగిపోయిన ఎమ్మెల్యే

‘కల్యాణ లక్ష్మి’  వస్తలేదన్నందుకు.. ఊగిపోయిన ఎమ్మెల్యే

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ఓ యువకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పిలిపించి అతడిని వెంటనే లోపల వేయించండి అంటూ ఊగిపోయారు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా చిలిపిచెడు మండలం అజ్జమర్రి గ్రామంలో ఆసరా పెన్షన్, బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి వచ్చారు. ఈసందర్భంగా ఓ యువకుడిని పిలిచి ‘కల్యాణ లక్ష్మి వస్తోందా ?’ అని అడిగారు. కల్యాణ లక్ష్మి చెక్కులు సకాలంలో వస్తలేవని ఎమ్మెల్యేకు అతడు బదులిచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే మదన్ రెడ్డి యువకుడిని తిట్టారు. ‘‘వీన్ని వెంటనే లోపల వేయండి’’ అని అక్కడున్న పోలీసులకు చెప్పారు.  

తెలంగాణ సర్కారు కల్యాణ లక్ష్మి పథకాన్ని 2014 అక్టోబరు 2న ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాలలోని రూ.లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.  2018 మార్చి 19న  కల్యాణ లక్ష్మి కింద అందించే సహాయాన్ని రూ.1,00, 116కి పెంచారు. పెళ్లి సమయంలోనే వధువు కుటుంబానికి ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తోంది. 2014 - 2015 బడ్జెట్లో రూ.230 కోట్లు, 2016 - 2017 బడ్జెట్లో రూ.738 కోట్లు, 2018-  2019 బడ్జెట్లో రూ.1450 కోట్లను తెలంగాణ సర్కారు కేటాయించింది. 2021 సెప్టెంబరు నాటికి రాష్ట్రంలోని 7,14,575 మందికి కల్యాణ లక్ష్మి  సాయం అందింది. వీరికి ఆర్థిక సాయం కోసం మొత్తం దాదాపు రూ.5,565 కోట్లు ఖర్చుచేసింది.