- అసెంబ్లీ జీరో అవర్ లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు : జడ్చర్ల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం అసెంబ్లీలో జీరో అవర్ లో ఆయన మాట్లాడుతూ 20 మండలాలు ఉన్న నాగర్ కర్నూల్‌జిల్లాకు 4 రెవెన్యూ డివిజన్లు ఉండగా, 17 మండలాలు ఉన్న పాలమూరు జిల్లాకు ఒక్క రెవెన్యూ డివిజన్ మాత్రమేఉందన్నారు. రెండు జాతీయ రహదారులకు మధ్య ఉన్న జడ్చర్లను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్నారు.
నవాబుపేట మండంలోని కొల్లూరు గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్ల ప్రాంతానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లా పరిధిలోని బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల మండలాలు 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్నాయని చెప్పారు. 44,167 జాతీయ రహదారులకు మధ్యలో జడ్చర్ల ఉంటుందని తెలిపారు.
జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని ఊర్కొండ మండలాన్ని నాగర్ కర్నూల్ డివిజన్ పరిధిలోకి చేర్చి తమకు అన్యాయం చేశారని అభిప్రాయపడ్డారు. రెండు జాతీయ రహదారులకు కూడలి కేంద్రంగా, పరిశ్రమలకు ప్రధాన నిలయంగా ఉన్న జడ్చర్లలో ఆర్టీసీ బస్ డిపోను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
