రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఆరోపణలు.. :అరికెపూడి గాంధీ

రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఆరోపణలు..  :అరికెపూడి గాంధీ

రాజకీయంగా తనను దెబ్బ కొట్టేందుకే కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. సులోచన అగర్వాల్​ హైకోర్టులో వేసిన పిటిషన్​పై ఆయన స్పందించారు. భూమి కోసం వారి కుటుంబాన్ని బెదిరించననడం అవాస్తవమని చెప్పారు.  

సులోచనను అడ్డుపెట్టుకుని కొందరు తనపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఆమె ఎవరో తనకు తెలియదని.. ఆమెపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ అంశాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.

పిటిషన్​ వివరాలు..

జీడిమెట్ల లోని సర్వే నంబర్ 38/8, 38/9 లో ఉన్న  భూమిని తన పేరిట రిజిస్టర్  చెయ్యాలంటూ తన కుటుంబాన్ని బెదిరించారని శేరిలింగంపల్లి  ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ పై  హైకోర్టులో సులోచన అగర్వాల్ పిటిషన్ వేశారు. అర్ధ రాత్రి ఎమ్మెల్యే గాంధీ మనుషులు తన  ఫ్యాక్టరీ లో దోపిడీ చేసినా  పోలీసులు స్పందించలేదని పిటిషన్ లో తెలిపారు.  

ఇరవై కోట్ల రూపాయల యంత్రాలను,  అల్యూమినియం బండిల్ లను గాంధీ పోలీసుల సాయంతో తీసుకెళ్లారని  కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  పిటిషన్ ను విచారించిన హై కోర్టు ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఇన్ స్పెక్టర్  ప్రశాంత్, ఎస్ ఐ మల్లేశ్వర్ లను   ఆదేశించింది. ఎమ్మెల్యే గాంధీ కి వ్యక్తిగతంగా నోటీసులు పంపాలని పిటిషనర్ కు కోర్టు సూచించింది. తదుపరి విచారణ ఆగస్టు 10కి వాయిదా వేసింది.