ములకలపల్లి, వెలుగు: శిరీష కుటుంబానికి అండగా ఉంటామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష హైదరాబాద్లో నర్సుగా పనిచేస్తూ ఇటీవల హత్యాచారానికి గురైన విషయం తెలిసింది. గురువారం ఆమె దశదినకర్మ, సంతాప సభ జరగగా.. ఎమ్మెల్యే హాజరయ్యారు.
ఈ సందర్భంగా శిరీష అన్న శివరాంకు ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శిరీష కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ఇప్పటికే ఆర్థికసాయంతోపాటు, ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. శిరీష మృతి ఆమె కుటుంబానికి తీరని లోటన్నారు. గ్రామస్తులకు చిరకాలం ఉపయోగపడేలా ఆమె పేరిట కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, కాంగ్రెస్ లీడర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
