దళారులను నమ్మి మోసపోవద్దు : ఎమ్మెల్యే బాలునాయక్

దళారులను నమ్మి మోసపోవద్దు : ఎమ్మెల్యే బాలునాయక్

 దేవరకొండ, వెలుగు :  రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సూచించారు. గురువారం నియోజకవర్గంలోని చింతపల్లి, పెండ్లిపాకల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

సన్న వడ్లకు క్వింటాల్‌‌‌‌కు రూ. 500 బోనస్ ఇస్తూ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందన్నారు. ఇప్పటికే ఎకరం లోపు రైతులకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయని, మిగిలిన వారికి త్వరలోనే అందుతాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ  వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.