చికిత్స కారణంగా రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనలేదు

చికిత్స కారణంగా రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనలేదు

తనకు దేశంలో, జర్మనీలో కానీ ఎలాంటి వ్యాపారాలు లేవని..చికిత్స కారణంగా తాను రాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్ పాల్గొనలేదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తన కుటుంబం బాగోగుల కోసం ప్రతి సంవత్సరం మూడు, నాలుగు సార్లు జర్మనీకి వెళ్లి రావడం జరుగుతుందని వివరణ ఇచ్చారు. 2009 నుంచి తనను గెలిపిస్తున్న నియోజకవర్గ ప్రజలందరికీ ఈ విషయం తెలుసన్నారు. చికిత్స కారణంగానే రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ విషయంలో తాను పాల్గొనలేదని, ఈ విషయం పార్టీకి, అసెంబ్లీ కార్యదర్శికి సమాచారం ఇచ్చానని స్పష్టం చేశారు. 

తనకు నియోజకవర్గ ప్రాంతంతో సామాజిక పేగు బంధం ఉందని కనుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను ముమ్మాటికీ భారతీయుడేనని, ఈ అంశంపై గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు తీర్పులిచ్చాయన్నారు. ప్రజాక్షేత్రంలో వరుసగా నాలుగు సార్లు ఓటమి చెందిన వారే నిరాశ, నిస్ప్రహలకు లోనై కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఎద్దేవా చేశారు.