వారం రోజులు నీళ్లలో ఉంటే.. ఇప్పుడు గుర్తొచ్చినమా ?

వారం రోజులు నీళ్లలో ఉంటే.. ఇప్పుడు గుర్తొచ్చినమా ?

బషీర్​బాగ్,  వెలుగు: వర్షాలకు నీట మునిగి వారం రోజులుగా ఇబ్బంది పడుతుంటే.. ఇప్పుడు పరామర్శించడానికి ఎలా వస్తారంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌ను హిమాయత్ నగర్ ఆదర్శ్ బస్తీ వాసులు నిలదీశారు. వానలకు నీట మునిగిన ఆదర్శ్ బస్తీలో శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్ వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. వారం రోజులుగా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మా బస్తీ గుర్తుకొచ్చిందా అంటూ స్థానిక జనం ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అనంతరం వారి సమస్యలను దానం నాగేందర్​కు చెప్పుకున్నారు.  ఇండ్లలోకి నీళ్లు వచ్చి ఇంట్లోని సామగ్రి తడిసిపోయిందని,  జీహెచ్ఎంసీ నుంచి అన్నం వస్తే తింటున్నాం..  లేకుంటే పస్తులు ఉంటున్నామని వాపోయారు.  నీళ్లు తొలగించమంటే అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల కిందట బస్తీలో ఒకరు చనిపోతే డెడ్ బాడీని తీసుకెళ్లడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చిందన్నారు.  

దీంతో ఎమ్మెల్యే వెంటనేబల్దియా జోనల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు.  బస్తీలో నిలిచిన నీళ్లను వెంటనే తొలగించాలని,  మళ్లీ వరద చేరకుండా తాత్కాలిక గోడ నిర్మించాలని ఆదేశించారు.  మీరు ఇలాంటి దుర్భర స్థితిలో జీవిస్తుంటే..  మనసుకు బాధ కలుగుతుందని,  తనను మన్నించాలని బస్తీ వాసులను ఎమ్మెల్యే కోరారు. వరద బాధితులకు నిత్యావసర సరకులు అందజేశారు.  ఈ సందర్భంగా తమకు నష్టపరిహారం ఇవ్వాలని కోరగా మొదట 30 కుటుంబాలకు రూ.10 వేలు ఇస్తామని ఎమ్మెల్యే అన్నారు.  రూ. 20 వేలు ఇవ్వాలని బస్తీ  వాసులు కోరడంతో, అదేవిధంగా ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు