మాట్లాడితే అర్థంపర్థం ఉండాలె

మాట్లాడితే అర్థంపర్థం ఉండాలె

వర్షాలు, వరదల వెనుక విదేశీ కుట్ర ఉందన్న సీఎం కేసీఆర్ కామెంట్లకు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చింది. కేసీఆర్ కు ఏదో ఆర్డర్ తప్పినట్లుందని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడితే అర్థం ఉండాలని అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడవద్దని సూచించారు. వర్షం కురిపించడంలో విదేశీ కుట్ర ఎలా ఉంటుందని ఈటల ప్రశ్నించారు. గతంలో కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు మేఘ మథనం చేసినా వర్షాలు పడలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

తొలిసారి ఆదివాసీ మహిళ దేశంలో అత్యున్నతమైన రాష్ర్టపతి స్థానంలో నియమించబడుతున్నారని, ఇది దేశానికే గర్వ కారణమని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల హామీని రాష్ర్ట ప్రభుత్వం నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని, ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గిరిజనులకు 9శాతం రిజర్వేషన్లు అందిస్తామన్నారు. NDAలో భాగస్వాములు కానిపార్టీలు కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు తెలుపుతున్నాయని, సీఎం కేసీఆర్ తీరు ఏంటో ఇప్పటికైనా గిరిజనులు అర్థం చేసుకోవాలని కోరారు. గిరిజనులకు రాజ్యాధికారం ఇవ్వాలని ప్రధాని మోడీ ఆలోచన చేస్తుంటే.. తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న పోడు భూములను ఫారెస్ట్ అధికారులు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల ఆవేదన అందరికీ కన్నీరు పెట్టిస్తోందని, నోరు లేనివారి మీద మీ ప్రతాపం చూపిస్తారా..? అంటూ మండిపడ్డారు. 

కేంద్రం తీరు పట్ల కేసీఆర్ ప్రభుత్వం సంకుచిత ధోరణితో వ్యవహరించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కురస మనుషులు ఎవరో.. బ్రాడ్ మైండ్ లేనిది ఎవరికో అర్థం అవుతోందన్నారు. మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, FRBM చట్టం అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉంటుందనే విషయం తెలియదా..? అని ప్రశ్నించారు. రాష్ర్టంలోని రైతు వేదికలు, మహిళా సంఘాల బిల్డింగ్స్,  డ్రైనేజీలు, సీసీ రోడ్లు వంటివి ఉపాధి హామీ పథకం నిధులు కావా..? అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతి అంతా కూడా ఉపాధి హామీ పథకం డబ్బులే కదా అని ప్రశ్నించారు. కేసీఆర్ మాటల్లో విశ్వసనీయత లేదని, ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులను కూడా చేయకుండా కేంద్రంపై నిందలు వేస్తున్నారని అన్నారు. 

గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు వస్తే గవర్నర్ తమిళి సై ట్రైన్ లో వెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం పోలీసు బందోబస్తు కూడా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. గవర్నర్ ను తీవ్రంగా అవమానిస్తున్నారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా..? అని ప్రశ్నించారు.