రసవత్తరంగా గజ్వేల్​ రాజకీయం

రసవత్తరంగా గజ్వేల్​ రాజకీయం
  • రసవత్తరంగా గజ్వేల్​ రాజకీయం
  • బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం

సిద్దిపేట, వెలుగు : సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతానని ఈటల రాజేందర్ చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్​గా మారింది.  గత రెండు ఎన్నికల్లో గజ్వేల్​లో కేసీఆర్​పై బలమైన ప్రత్యర్థులు లేకపోవడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. ఈటల రాజేందర్​ఇక్కడ పోటీ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయోనని అప్పుడే చర్చ మొదలైంది. హుజూరాబాద్​ నియోజకవర్గంలో ఈటలను ఓడించడానికి టీఆర్ఎస్​ సర్వశక్తులూ ఒడ్డింది. అయినా ఓటమి తప్పలేదు. గజ్వేల్​ నియోజకవర్గంలో సైతం పోటీ తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈటల రాజేందర్ తన రాజకీయ అరంగేట్రానికి ముందు పౌల్ట్రీ వ్యాపారాన్ని గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ కేంద్రంగా ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు రాకపోకలు సాగిస్తుండేవారు. గతంలోనే గజ్వేల్ నుంచి పోటీ చేయాలని అనుకున్నా రిజర్వేషన్లు అనుకూలించక హుజూరాబాద్ నుంచి పోటీ చేశారు. అయినప్పటికీ గజ్వేల్ నియోజకవర్గానికి చెందినవారితో సత్సంబంధాలను కొనసాగించారు. ఈటల బీజేపీలో చేరిన తర్వాత ఇటీవలి కాలంలో పలువురు టీఆర్ఎస్​ అసంతృప్త నాయకులు ఆయనతో టచ్​లోకి వెళ్లడం గమనార్హం. రెండు దశాబ్దాలుగా గజ్వేల్ నియోజకవర్గంలో తనకున్న పరిచయాలతో సీఎం కేసీఆర్ ను ఢీకొట్టడానికి ఈటల రెడీ అవుతున్నారు.

వ్యూహాత్మకంగా అడుగులు
గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఈటల కొంతకాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది అక్టోబరులో జరిగిన హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత హైదరాబాద్ వెళ్తూ గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో మాట్లాడారు. రానున్న రోజుల్లో గజ్వేల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ప్రకటించారు. అనంతరం గజ్వేల్ నియోజకవర్గంలోని తన పూర్వ పరిచయాలతో పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. గజ్వేల్ పట్టణంలో జరిగిన పలు శుభకార్యాలకు హాజరవడమే కాకుండా వివిధ కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ లోని  బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందడంతో వారి కుటుంబీకులను వ్యక్తిగతంగా పరామర్శించడమే కాకుండా రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. గజ్వేల్ మండలం అహ్మదీపూర్లో శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇటీవల బీజేపీ చేరికల కమిటీ చైర్మన్​గా ఈటల ఎన్నికవడంతో గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. గజ్వేల్ నుంచి ఈటల బరిలోకి దిగితే పార్టీతో సంబంధం లేకుండా ఆయనకు అండగా ఉంటానని వర్గల్ మండలానికి చెందిన  జాతీయ పార్టీ నేత ఒకరు అంతర్గత చర్చల్లో ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈటల గజ్వేల్ బరిలోకి దిగితే అన్ని పార్టీలకు చెందిన బీసీ వర్గాల నేతలు ఒకే తాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతానని ప్రకటించడం స్థానిక పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతోంది. నియోజకవర్గంలో బీజేపీకి సరైన నాయకత్వం లేకపోవడంతో వారంతా ఏకతాటిపైకి రాలేదు. రెండు దశాబ్దాల కాలంలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఒక్కసారి మాత్రమే బీజేపీ అభ్యర్థి బరిలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ బీజేపీ అభ్యర్థిగా మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు ఆకుల లలిత పోటీ చేశారు. స్థానికంగా నాయకత్వం ఆశించినంతమేర  ఎదగకపోవడంతో ఈ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 1,587 (0.76 %) ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ 2019 మే పార్లమెంటు ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావు 21,513 ఓట్లు సాధించారు. గజ్వేల్​లో బీజేపీకి ఆదరణ ఉందన్న విషయాన్ని నిరూపించారు. ప్రస్తుతం ఈటల ప్రకటనతో గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీకి మంచి రోజులొచ్చాయనే ప్రచారం జోరందుకుంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారుల్లో కొందరు ఈటల వెంట నడిచే అవకాశాలున్నట్టు జోరుగా చర్చ జరుగుతోంది.

మెజార్టీ ఓటర్లు బీసీలే
గజ్వేల్ నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లు బీసీలే. నియోజకవర్గంలో మొత్తం 2,51,556 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు 1,25,668, మహిళలు 1,25,665 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో  సగానికంటే ఎక్కువమంది బీసీలే. ఇందులో ఈటల వర్గానికి చెందిన ముదిరాజ్ ఓటర్లు దాదాపు 50 వేలకు పైగా ఉన్నారు. వీరంతా ఈటలకు మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు ఇతర పార్టీలకు చెందిన బీసీ లీడర్లు సైతం ఆయన వెంట నడిచే అవకాశాలున్నాయి. గజ్వేల్ నియోజకవర్గం ఏర్పడిన తరువాత చాలాకాలం పాటు ఎస్సీ రిజర్వ్​గా ఉంది. ఇటీవల పునర్విభజనలో జనరల్ సీటుగా మారింది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు గజ్వేల్ నియోజకవర్గం నుంచి బీసీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం దక్కలేదు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత సైతం ఈటలకు కలిసొచ్చే అవకాశాలున్నాయి.