సింగరేణి కార్మికుల సమస్యలు తీరుస్తాం: ఎమ్మెల్యే గడ్డం వినోద్

సింగరేణి కార్మికుల సమస్యలు తీరుస్తాం:  ఎమ్మెల్యే గడ్డం వినోద్

మంచిర్యాల: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మంచిర్యాల జిల్లాలోని కాసిపేట్ 2ఇంక్లైన్ కాలనీలో సింగరేణి కార్మికుల గేట్ మీటింగ్ లో ఎమ్మెల్యే గడ్డం వినోద్,పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ..  మూడు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు. గెలిచిన మూడు రోజులకే సోమన్ పల్లి గ్రామంలో రోడ్డు వేశానన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు తీరుస్తామని.. సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  కార్మికుల హక్కుల కోసం పోరాడుతామని చెప్పారు. ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని.. అది మొట్ట మొదటిగా బెల్లంపల్లిలో ప్రారంభించామని గుర్తు చేశారు. 

400 సీట్లు వస్తే.. రాజ్యాంగం రద్దు చేస్తామని బీజేపీ అంటోందని విమర్శించారు వినోద్. రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని.. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ కోసం తాము పోరాడి ప్రారంభిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. రూ.200 కోట్లతో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. బెల్లంపల్లికు త్రాగు నీటి సమస్యలు, జూనియర్ కాలేజ్ తీసుకువస్తామని.. పోడు భూముల సమస్యలు తీరుస్తామని భరోసా ఇచ్చారు. వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.