ఆదాయం వచ్చే పంటలను సాగుచేయాలి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఆదాయం వచ్చే  పంటలను సాగుచేయాలి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి రూరల్/రేగొండ, వెలుగు: రైతులు అధిక ఆదాయం వచ్చే పంటల సాగుపై దృష్టి పెట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం గణపురం మండలం మైలారంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  విద్యుత్ ప్రమాదాల వల్ల పంటలు, ప్రాణనష్టం సంభవిస్తున్న నేపథ్యంలో సమస్యలను గ్రామసభల్లో ప్రస్తావించాలని కోరారు. 

పంట అవశేషాలను కాల్చవద్దని, దీంతో భూసారం దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నందున విద్యార్థులను అక్కడే చేర్పించాలని సూచించారు. నియోజకవర్గంలో మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొంరయ్యగౌడ్, కౌన్సిలర్ అప్పం కిషన్, రేగొండ సర్పంచ్ వానరాశి మౌనిక తదితరులు పాల్గొన్నారు.