తెలంగాణలో విషపు నాగులు తిరుగుతున్నయ్: గొంగిడి సునీత

తెలంగాణలో విషపు నాగులు తిరుగుతున్నయ్: గొంగిడి సునీత

తెలంగాణలో విషపు నాగులు తిరుగుతున్నాయని ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల వెనుక ఎవరున్నారో త్వరలో బయటపడుతుందన్నారు. ఏపీలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో..నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎందుకు ఎదురు చూస్తున్నారో షర్మిల అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడిగితే సమాధానం చెబుతారని చెప్పారు. షర్మిల చేస్తున్న వ్యాఖ్యలను విని తట్టుకోలేకనే పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా షర్మిల విషపు నవ్వు నవ్వుతూ తెలంగాణలో తిరుగుతున్నారని ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆరోపించారు. తండ్రి పేరు చెప్పుకుని తిరగడం తప్ప షర్మిలకు ఐడెంటిటీ ఏముందని ప్రశ్నించారు. ప్రజల కోసం చేస్తున్న పాదయాత్ర అయితే.. విభజన సమస్యల గురించి ఒక్కసారి అయినా కేంద్రాన్ని అడిగారా అని నిలదీశారు. షర్మిలకు తెలంగాణ ప్రజల కష్టాలు, గిరిజన బిడ్డల తంటాలు తెలుసా అని ప్రశ్నించారు. షర్మిల ఏ ఎంబసీలో వీసా తీసుకొని తెలంగాణకు వచ్చారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధిపై ఓర్వలేక టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని గొంగిడి సునీత తెలిపారు. ఇప్పుడు ఏపీలో ఓదార్పు అవసరమని..అక్కడకు వెళ్లి పాదయాత్ర చేసుకోవాలని సూచించారు. యాత్ర పేరుతో ఇక్కడ అసత్యాలు, అబద్ధాలు ఆడితే తెలంగాణ ప్రజలు సహించరని పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు ఒక లెక్క ఇక ముందు మరో లెక్క అని అన్నారు. ఇకపై వైఎస్ షర్మిల ఆటలు తెలంగాణలో సాగవన్నారు. షర్మిల వ్యవహారశైలితో సెటిలర్లు  విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. కోలాటం ఆడటం తెలుసు.. బతుకమ్మ ఆడటం తెలుసు.. నకరాలు కొడితే ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలుసన్నారు. ఐటీ దాడులు చేపిస్తున్న వాళ్ళు, సీబీఐ దాడులు చేయిస్తున్న వాళ్ళే షర్మిల వెనక వున్న విషపు నాగులు అని గొంగిడి సునీత ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలను ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడితే తాము చేతులు కట్టుకుని కూర్చోవాలా అని ప్రశ్నించారు. 

రేపటి నుంచి కార్యకర్తలను ఆపలేము

టీఆర్ఎస్ పై విషం చిమ్మేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని ఎంపీ మాలోతు కవిత ఆరోపించారు. మొన్నటి ఎలక్షన్ లో షర్మిల ఆంధ్రాలోనే ఓటు వేశారని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసినా ఓపికతో భరిస్తూ కార్యాకర్తలు సంయమనం పాటించారని...రేపటి నుంచి తాము కార్యకర్తలను ఆపలేమన్నారు. షర్మిల పద్దతి మార్చుకోవాలని.. ఏం జరిగినా తాము బాధ్యులం కాదన్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన షర్మిల కేసీఆర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.