ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  •     ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి 

అమీన్​పూర్, వెలుగు: పటాన్​చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, అసైన్​మెంట్​ భూములు కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకోబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి తెలిపారు. అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధిలోని కిష్టారెడ్డిపేట, రెయిన్​బో మెడోస్​ కాలనీలో  ప్రభుత్వ భూమి వివాదంపై తహసీల్దార్​ వెంకటేశ్​, మాజీ ఎంపీపీ దేవానంద్​, మాజీ వైస్​ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ సర్పంచ్​ కృష్ణతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు. 

ఈ సందర్భంగా కాలనీవాసులు, రెవెన్యూ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, డెవలపర్స్​తో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్న లక్ష్యంతో ఇళ్లను కొనుగోలు  చేసిన కాలనీ వాసులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. 

అందరి సమక్షంలో మారోమారు జాయింట్​ సర్వే నిర్వహించి పూర్తి న్యాయం చేస్తామని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వ, అసైన్​మెంట్​ భూముల వివరాలు సేకరించి కబ్జాలకు గురికాకుండా రక్షణకు ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపారు. 

గేటెడ్​ కమ్యూనిటీలు, కాలనీలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ  పార్కులు, రహదారులను కబ్జా చేసి డబుల్​ రిజిస్ట్రేషన్​లు చేస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తే చట్ట రీత్య చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్ని  హెచ్చరించారు. కొన్ని మండలాలలో ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ భూములు దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. 

రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్థలాలను, ఆఫీసులను, కమ్యూనిటీ ఫంక్షన్​హాల్స్​, విద్యాసంస్థలను ఇతర వాటినికి వినియోగిస్తామన్నారు.