
పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం గ్రామంలో 6 కుంటలు ఆక్రమణకు గురవడం వల్ల మత్స్యకారుల జీవనాధారం దెబ్బతిందని వెంటనే ఆక్రమణలను తొలగించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నీటి పారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ అహ్మద్ హుస్సేన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన అధికారులను కలిసి పాశమైలారం పరిధిలోని కొత్త కుంట, పాపాయిగూడ కుంట, గొల్లవానికుంట, ఉబ్బానికుంట, వడ్లవానికుంట, ఆరోటోని కుంటపై జరిగిన 39 ఎకరాల ఆక్రమణల వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కుంటలపై ఆధారపడి జీవించే మత్స్యకారులు ప్రస్తుతం పరిశ్రమల్లో కూలీలుగా పనిచేస్తున్నారన్నారు. వెంటనే ఆక్రమణలను తొలగించి, కుంటలను అభివృద్ధి చేసి మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే కోరగా అధికారులు త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి, హైదారాబాద్సరిహద్దులో గల లింగంపల్లి చౌరస్తాలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలని జాతీయ రహదారుల సంస్థ ప్రాంతీయ అధికారి కృష్ణ ప్రసాద్‌ను ఎమ్మెల్యే కోరారు.
సత్య సాయి సేవలు ప్రశంసనీయం
సమాజ సేవలో శ్రీ సత్య సాయి సేవాసమితి పాత్ర ప్రశంసనీయమని పటాన్చెరు శాసన సభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శాంతినగర్‌లోని సత్య సాయి బాబా మందిరంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవాసమితి చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. పటాన్చెరులో బాబా మందిర నిర్మాణానికి సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు. గురుపూర్ణిమ ముగింపు సందర్భంగా 3 వేల మంది భక్తుల పుట్టపర్తి యాత్రకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మార్కెట్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, రామిరెడ్డి, గిరి ఉన్నారు.