
తాము ప్రజాస్వామ్య వీరులమని, దాన్ని కాపాడే పనిలో నిమగ్నమై ఉన్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. భవిష్యత్తులో అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. ఫాం హౌస్ కేసు అనంతరం తొలిసారి ఆ ఇష్యూతో సంబంధమున్న నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు. నియోజకవర్గానికి వెళ్తూ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నామని గువ్వల స్పష్టం చేశారు. రూ.100కోట్లు తీసుకుని ఎటో వెళ్లిపోయాడంటూ నియోజకవర్గంలో పోస్టర్లు వెలవడంపై ఆయన స్పందించారు. తన పోస్టర్లు వేసిన వారి రాజకీయ భవిష్యత్తు భూస్థాపితం అవుతుందని అన్నారు. మీటింగ్ నుంచి నేరుగా కేసీఆర్ ఫాం హౌస్ కు వెళ్తారా అని ప్రశ్నించగా.. నచ్చిన దగ్గరకుపోతమని గువ్వల బాలరాజు సమాధానం ఇచ్చారు. తమకు ఆ స్వేచ్ఛ ఉందని, భారతీయులందరికీ స్వేచ్ఛ కలిగించడమే లక్ష్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పారు.
రక్షణ కోసమే ప్రగతి భవన్కు..
తమను ఎవరూ నిర్బంధించలేదని గువ్వల బాలరాజు చెప్పారు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని..చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. రక్షణ కోసమే తమను ప్రగతి భవన్ లో కేసీఆర్ ఉండమన్నారని వెల్లడించారు. ఇంటలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే రక్షణలో ఉన్నామన్నారు. సీఎం కేసీఆర్ కు అందుబాటులో ఉండటానికే ప్రగతిభవన్ లో ఉన్నామన్నారు. తమను ఇబ్బంది పెట్టే ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. వారికి తగిన బుద్ది చెబుతామన్నారు. తమ మీద వాడే సంస్థలతోనే వారినే అంతం చేస్తామన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్న బీజేపీని దోషిగా నిలబెడతామని చెప్పారు. కేసిఆర్ వదిలిన బాణంగా పనిచేస్తామన్నారు.
టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ నలుగురు ఎమ్మెల్యేలను ప్రశంసలతో ముంచెత్తినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫాం హౌస్ కేసుతో సంబంధమున్న నలుగురు ఎమ్మెల్యేలు మీటింగ్ అనంతరం ఒకే కారులో బయలుదేరి వెళ్లారు. గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్థన్ రెడ్డి తెలంగాణ భవన్ నుంచి నేరుగా కేసీఆర్ ఫాం హౌస్ కు వెళ్లిన్నట్లు సమాచారం.