నారాయణ రావు పేటను రాష్ట్రంలోనే ఆదర్శంగా చేసుకుందాం

నారాయణ రావు పేటను రాష్ట్రంలోనే ఆదర్శంగా చేసుకుందాం

సిద్దిపేట జిల్లా:  జిల్లాలోని నారాయణ రావు పేటలో మాజీ మంత్రి హరీశ్ రావు నేడు పర్యటించారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మండల కార్యాలయాలను హరిశ్ రావు ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ.. నారాయణ రావు పేట మండలం 30 ఏండ్ల కళ అనీ, ఈ కళ  టిఆర్ ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఆశీస్సుల వల్ల  ఫలించిందని అన్నారు. తెలంగాణ పోరాటం ఎలా జరిగిందో ఈ మండల పోరాటం అలాగే జరిగిందన్నారు.  మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందామని, కాళేశ్వరం నీళ్లతో 5వేల ఎకరాలకు నీరిస్తామని అన్నారు.

ప్రస్తుతం రైతులు కాలం కాక ఆందోళనలో ఉన్నారని, గోదావరి నీళ్లొస్తే కాలం తో పనిలేక రెండు పంటలు పండుతాయని హరీశ్ అన్నారు. రైతులు ఆరుతడి పంటలు పండించి అధిక ఆదాయం పొందాలన్నారు. వ్యవసాయం అనేది కేవలం బట్టకు పొట్టకు కాకుండా లాభం పొందేలా ఉండాలన్నారు.

మండలం లో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని.. అవి పరిష్కరించే దిశగా ఫుల్ టైమ్ ఏమ్మార్వో ని ఏర్పాటు చేస్తామన్నారు.  స్పెషల్ డ్రైవ్ పెట్టి అర్హులైన వారికి పాస్ బుక్స్ పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. మరో 5 ఏండ్ల వరకు ఎలక్షన్ లేవు కాబట్టి.. అందరి సహకారం తో మండలాన్ని అన్ని రంగాల్లో  ఆదర్శంగా చేసుకోవాలని మండల ప్రజలకు సూచించారు. మండల కేంద్రానికి  బస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

పర్యావరణాన్ని కాపాడాలని.. అందుకై  ప్రతి ఒక్కరు రెండు చెట్లు దత్తత తీసుకొని కాపాడాలని హరీష్ ప్రజలకు పిలుపునిచ్చారు.  తడి, పొడి చెత్త వేరుచేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించి క్యాన్సర్ ను నివరించాలని, మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలంగా తీర్చిదిద్దాలన్నారు హరీశ్ రావు.